- ఒకరు క్షేమం
- ఆరుగురి కోసం గాలింపు
- సిఎం చంద్రబాబు ఆరా
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం), శాంతిపురం (చిత్తూరు జిల్లా) : విశాఖ తీరం మళ్లీ కన్నీటి సంద్రమైంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు క్షేమంగా ఉన్నారు. మిగిలిన ఆరుగురి కోసం తీవ్ర గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు జారీ చేశారు.
గత నెల 30న ఫిషింగ్ బోటుపై విజయనగరం జిల్లా భోగాపురం మండలం మక్కాం గ్రామానికి చెందిన కారి చిన్నా, అమర అప్పలరాజు, కారి చిన్నయ్య, కారి గరగయ్య, కారి సీతోడు, ఎం.చిన్న అమ్మోరు, విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పెదనాగమయ్యపాలెం ప్రాంతానికి చెందిన రాగతి బండియ్య చేపల వేటకు వెళ్లారు. బోటులో ఉన్నవారు శనివారం ఫోన్ చేసి ‘గంగవరం దగ్గర ఉన్నాం, గంటలో హార్బర్‌కు చేరుకుంటాం’ అని చెప్పారు. అయితే, రాత్రి అయినప్పటికీ చేరుకోకపోవడంతో వారి కుటుంబీకులు అధికారులకు సమాచారమిచ్చారు. బోటులోని వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని తెలిపారు. వెంటనే కోస్ట్ గార్డ్, నేవీని అధికారులు అప్రమత్తం చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. జాయింట్ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా అన్ని రకాల సిగ్నల్స్ ఆధారంగా బోటును గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఓనర్-కమ్-డ్రైవర్ అయిన కారి చిన్నాను విశాఖకు పది నాటికల్ మైళ్ల దూరంలో పనామా నౌక రక్షించింది. ఆ నౌక సమాచారం ఇవ్వగానే కోస్ట్ గార్డ్ బృందం చిన్నాను తమ రక్షణలోకి తీసుకుంది. మిగిలిన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నేవీ నౌకలు, కోస్ట్ గార్డ్ షిప్‌లతో విస్తృతంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. చివరిసారిగా వచ్చిన సిగ్నల్స్, బోటు ప్రయాణించిన దిశ ఆధారంగా అన్వేషణ కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బోటు ప్రమాదానికి గురైంది. అందులోని వారు మరో బోటుకు లేదా సమీప తీరానికి చేరి ఉండే అవకాశముందని లేదా గల్లంతై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర హోం మంత్రి అనిత అన్ని సంబంధిత శాఖలతో సంయుక్త సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తుపాను హెచ్చరికలు లేవని, అయితే, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలులు, ఎత్తైన అలల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అధికారులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజి, విశాఖ సిపిలను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడుకు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సిఎం ఆదేశాలిచ్చారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు స్థానిక ఫిషింగ్ హార్బర్‌లోని బోటు యజమానుల సంఘం కార్యాలయం వద్దకు ఆదివారం ఉదయం చేరుకున్నారు. వేటకు వెళ్లిన తమ వారు ఏమయ్యారని అప్పటికే అక్కడికి చేరుకున్న అధికారులను, బోటు యజమానులను అడిగారు. గల్లంతైన వారు క్షేమంగా ఉన్నదీ లేనిదీ స్పష్టంగా సమాధానం రాకపోవడంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ తదితరులు అక్కడికి చేరుకొని బాధితుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు.
ముమ్మరంగా గాలింపు : అచ్చెన్నాయుడు
కాకినాడ నుంచి ప్రత్యేక నౌక తెప్పించి, హెలికాప్టర్లతోనూ గాలించామని మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. భారత కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఓనర్-కమ్-డ్రైవర్ అయిన కారి చిన్నాను రక్షించిన మర్చంట్ నౌక కెప్టెన్, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు.
మరో ఘటనలో పది మంది మత్స్యకారులు సురక్షితం
మరో ఘటనలో ఒడిశా తీరంలో విశాఖకు చెందిన బోటు సిబ్బందిని రక్షించామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఒడిశా మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేశామని, మత్స్యకారులను స్వస్థలానికి చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)