బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది : పవన్ కల్యాణ్

2 గంటల క్రితం

నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది : పవన్ కల్యాణ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : అభిమాని నిరంజన్ మృతిపై ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. పొనుగంటి నిరంజన్ (17) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి విదితమే. అతడిని స్మరించుకుంటూ ... పవన్‌ పోస్ట్‌ పెట్టారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.


''కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి... నన్ను చూడగానే అతడి ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు... ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతడి శరీరం వ్యాధితో పోరాడుతున్నా.. మనసునిండా ధైర్యమే ఉంది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితంపై అతడు చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడు ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. అతడి చిరునవ్వు, అతడు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి `` అని పవన్ పేర్కొన్నారు.


హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ.. ఎదుగుదల లోపించి.. మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న పవన్‌.. నిరంజన్‌ను గత నెలలో పరామర్శించారు. ఇటీవల అతడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్‌ కన్నుమూశాడు.


‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే ..

నిరంజన్‌ను కలిసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేశారు. ‘తనకు కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని’ నిరంజన్‌ చెప్పగా..‘కొని పంపిస్తా చిన్నా’ అంటూ హామీ ఇచ్చారు. ఆరోజే కుక్క పిల్లను అందించారు. అలాగే ‘OG 2’ తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్’ అని కలిసి సినిమా చూద్దామని పవన్ చెప్పారు. ఈలోపే ఇలా జరగడం పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.


సోనూ సూద్ పరామర్శ..

హనుమకొండకు చెందిన నిరంజన్ కుటుంబ సభ్యులతో ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్