- మంత్రి సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అర్హులైన నేతన్నలందరికీ ‘నేతన్నల సేవలో’ పథకంలో ఆర్థిక సాయమందిస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిలో అర్హులను గుర్తించి, వారం రోజుల్లోగా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రాష్ట్ర సచివాయంలోని సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేతన్నలందరూ గౌరవ ప్రదమైన జీవనం సాగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా చేనేత రంగ అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేతలకు రూ.నాలుగు వేల చొప్పున పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. చేనేత కుటుంబాలకు మరింత ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇటీవల ‘నేతన్నల సేవలో’ పథకాన్నికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా 71,536 మందికి రూ.25 వేల చొప్పున్న ఆర్థిక సాయం అందించామన్నారు. అర్హులు ఇంకా ఉన్నారన్న ఉద్దేశంతో దరఖాస్తులు కూడా స్వీకరించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,678 మంది నేతన్నల సేవలో పథకానికి దరఖాస్తులు చేసుకున్నారని వెల్లడించారు. వారిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు చేనేత, జౌళి శాఖాధికారులతో మంత్రి సవిత తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులను గుర్తించాలన్నారు. వారందరికీ ప్రభుత్వం అందజేసే పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. తమకు ఆర్థిక సాయం అందలేదనే ఫిర్యాదులుగాని, దరఖాస్తులగాని మరోసారి రాకూడదన్నారు. ఈ సమీక్షా సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు, వర్చువల్ గా ఆయా జిల్లాలకు చెందిన ఎడిలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)