సమస్యలపై చింతూరులో మహా ప్రదర్శన, ఐటిడిఎ వద్ద ధర్నా
పూర్తి పరిహారం, పునరావాసం, పోడు భూములకు పట్టాలు అందేవరకూ పోరాటం : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- చింతూరు (పోలవరం జిల్లా) : పోలవరం నిర్వాసితులు గర్జించారు. పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం, పోడు భూము లకు పట్టాలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన చింతూరు ఐటిడిఎ కార్యాలయానికి పోటెత్తారు. ముంపు మండలాల నుంచి ఎర్ర జెండాలు చేబూని... ఊరూ వాడా కదిలి రావడంతో చింతూరు సోమవారం ఎర్ర సముద్రాన్ని తలపించింది. ‘మా మట్టి - మా నీరు - మా హక్కు’ నినాదంతో పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఈ నెల ఒకటిన ఎటపాక మండలంలో ప్రారంభమైన బైకు యాత్ర ఎటపాక, చింతూరు, కూనవరం, విఆర్.పురం మండలాల్లో గ్రామగ్రామానా సాగింది. వాడవాడలా నిర్వాసితులు యాత్రా బృందానికి స్వాగతం పలికారు. సోమవారం చింతూరు ఐటిడిఎ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వేలాది మంది నిర్వాసితులు మండల కేంద్రంలోని సంత మార్కెట్ నుంచి లారీ యూనియన్ ఆఫీసు, ఆదివాసీ అమరవీరుల కూడలి, అంబేద్కర్ సెంటర్, పోలీస్ స్టేషన్ మీదుగా ఐటిడిఎ కార్యాలయం వరకూ మహా ప్రదర్శన నిర్వహించారు. థింసా, కొమ్ము డోలు నృత్యాలు, చైతన్య గీతాలతో ఆద్యంతం ప్రదర్శన ఉత్తేజంగా సాగింది. తమ హక్కులపై నిర్వాసితులు పెద్ద పెట్టున నినదించారు. ఐటిడిఎ వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసి తులకు పూర్తి స్థాయి పరిహారం, పునరావాసం అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచి ఆదివాసీలకు తీవ్ర నష్టం చేస్తున్నారని వివరించారు. ఏజెన్సీలో ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా మరో జిఒ తెస్తామని హామీ ఇచ్చి గెలిచిన టిడిపి కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రభావిత మండలాల్లోని 1.50 లక్షల మంది నిర్వాసితులకు పునరావాసం విషయంలో ప్రభుత్వం కాంటూరు లెక్కలతో అన్యాయం చేస్తోందని తెలిపారు. లైడార్ సర్వేతో మభ్యపెట్టి నిర్వాసిత ప్రజానీకాన్ని నిలువునా ముంచిందన్నారు. ముంపు మండలాల ప్రజలు తమ ప్రాంతాలను, గ్రామాలను త్యాగం చేసి ప్రభుత్వం చూపిన ప్రదేశాల్లోకి వెళ్లేందుకు సిద్ధమైనా, వారికి న్యాయమైన హక్కులు కల్పించలేదని తెలిపారు. వరదల్లో మునిగే ప్రాంతాల్లోనే పునరావాస కాలనీలు నిర్మించడం దుర్మార్గమన్నారు. కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. 1986లోనూ, 2022లోనూ వచ్చిన వరదలు ఈ ప్రాంత ప్రజానీకానికి బాగా గుర్తుండిపోయాయని తెలిపారు. 2022లో పోలవరం వద్ద 37 మీటర్ల నీటిమట్టం ఉన్నప్పుడే భారీగా గ్రామాలు మునిగిపోయాయని, 41 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంటే ఈ ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంటూరు లెక్కలు కాకి లెక్కలని విమర్శించారు. ముంపు ప్రజలకు న్యాయమైన పరిహారం, పునరావాసం ఇవ్వకుండా ప్రతిసారీ మారుతున్న కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లాది రూపాయల ఎదురు నిధులు ఇవ్వడం అన్యాయమన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా పోలవరం ప్రారంభోత్సవానికి దిగితే అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నిర్లక్ష్యం : కె లోకనాథం
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. నేటికీ గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పేరుతో సాగునీరు ఇవ్వలేదని, రోడ్లు ఏర్పాటు చేయలేదని స్థానిక ఎమ్మెల్యేను ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించగా... ముంపులో మునిగిపోయే ప్రాంతాలకు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అని ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం విడ్డూరంగా లోకనాథం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, సున్నం రాజులు, పల్లపు వెంకట్, నాయకులు సీసం సురేష్, మడకం నాగమణి, పులి సంతోష్ కుమార్, సోయం చిన్నబాబు, మాజీ ఎంపిపి కారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐటిడిఎ పిఒ నరేంద్ర పడాల్‌కు 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ముంపు మండలాల్లోని సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.







కామెంట్‌లు (0)