సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిస్లెరీ తాగునీటిపై వివాదం.. విచారణకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గ్రీన్ సిగ్నల్!

1 గంట క్రితం

బిస్లెరీ తాగునీటిపై వివాదం.. విచారణకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గ్రీన్ సిగ్నల్!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 01:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్యాకేజ్డ్ తాగునీటి బ్రాండ్ 'బిస్లెరీ' నాణ్యత, భద్రతపై మరోసారి తీవ్ర వివాదం చెలరేగింది. సంస్థకు చెందిన గోవా ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన ఒక బ్యాచ్ తాగునీటి నమూనాల్లో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా 'బ్రోమేట్' అనే హానికర రసాయనం ఉన్నట్లు తేలడంతో, బిస్లెరీపై విచారణ ప్రారంభించేందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ఆరోపణలను బిస్లెరీ సంస్థ ఖండించింది. తదుపరి స్వతంత్ర ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో బ్రోమేట్ స్థాయిలు నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని ఆ సంస్థ చెబుతోంది.


వివాదం నేపథ్యం ఇదే..

నవంబర్ 23న బిస్లెరీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. 2025 సెప్టెంబర్‌లో గోవా ప్లాంట్‌లో తయారైన ఒక నిర్దిష్ట బ్యాచ్ నీటి చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. 2025 సెప్టెంబర్ 30న గోవా తయారీ కేంద్రం నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు ఆరు నమూనాలను సేకరించారు. ప్రాథమిక పరీక్షల్లో ఐదు నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా, ఆరో నమూనాలో లీటరుకు 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం... ఇది లీటరుకు గరిష్టంగా 10 మైక్రోగ్రాములకు మించకూడదు. బ్రోమేట్ అనే రసాయన సమ్మేళనం మానవ శరీరానికి దీర్ఘకాలిక హాని కలిగించడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదానికి కూడా దారితీస్తుంది.


పరీక్షా ఫలితాల్లో వైరుధ్యం.. బిస్లెరీ వాదన

ప్రాథమిక పరీక్షా ఫలితాలను సవాలు చేస్తూ బిస్లెరీ 2025 నవంబర్ 22న అప్పీల్ చేసింది. దీంతో నమూనాను పునఃపరీక్ష కోసం రిఫరల్ ల్యాబొరేటరీకి పంపారు. అక్కడ బ్రోమేట్ స్థాయిలు పరిమితిలోనే ఉన్నట్లు తేలినప్పటికీ, 'పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్' (PAHs) అనే మరో రసాయనం ఉన్నట్లు నివేదిక పేర్కొందని బిస్లెరీ తెలిపింది.


పరీక్షా ఫలితాల్లోని ఈ తేడాలను ప్రశ్నిస్తూ, అదే నమూనాను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన మరో ప్రయోగశాలలో బిస్లెరీ పరీక్ష చేయించింది. అక్కడ కూడా బ్రోమేట్ స్థాయిలు సురక్షిత పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని, ఆ నివేదికను 2026 ఫిబ్రవరి 2న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయంలో అధికారికంగా సమర్పించామని సంస్థ పేర్కొంది. ఆ తర్వాత నియంత్రణ సంస్థ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, దాంతో ఈ అంశం ముగిసిపోయిందని భావించామని బిస్లెరీ తెలిపింది. ఇప్పటివరకు తమకు ఈ-మెయిల్ లేదా పోస్టు ద్వారా ఎలాంటి నోటీసులు అందలేదని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లో కూడా సంబంధిత నోటీసు కనిపించలేదని సంస్థ వివరించింది.


ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠిన వైఖరి

మరోవైపు, నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ప్రాథమిక పరీక్షల్లో బ్రోమేట్ పరిమితి ఉల్లంఘన స్పష్టంగా రుజువైందని, తదుపరి రిఫరల్ ల్యాబ్ పరీక్షల్లోనూ ఆ నమూనా సురక్షితం కాదని (అన్‌సేఫ్) తేలిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. రిఫరల్ ల్యాబ్ నివేదికలో PAHs రసాయనాల ఉనికి కూడా బయటపడిందని పేర్కొంది. ఈ ఆధారాలతో ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 కింద అసురక్షిత ఆహార నిబంధనల ఉల్లంఘన కింద బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.


ప్రజారోగ్యంపై ప్రశ్నలు

తమ ఉత్పత్తి ప్రక్రియలో 10 దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని, వినియోగదారుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని బిస్లెరీ పునరుద్ఘాటించింది. అయితే, వివిధ ప్రయోగశాలల నివేదికల్లో భిన్నమైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో, తుది నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తాగునీరు వంటి నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం నియంత్రణ సంస్థల పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్