శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూజిళ్లపల్లి దళితుల పోరాటం విజయవంతం

52 నిమిషాల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆర్చి నిర్మాణానికి అంగీకారం, అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు సానుకూలం

ప్రజాశక్తి - పంగులూరు (ప్రకాశం జిల్లా) : తమ కాలనీ గుర్తింపు కోసం ఆర్చి నిర్మాణం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోరుతూ 40 రోజులుగా ఆందోళన చేస్తున్న నూజిళ్లపల్లి దళితుల పోరాటం శనివారం విజయవంతమైంది. ఆర్చి నిర్మాణానికి అంగీకారం తెలిపి, విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా అధికారులు స్పందించడంతో దళితులు ఆందోళన విరమించారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ‌తహశీల్దార్‌ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేసిన దళితులు... పది రోజులుగా అధికారుల స్పందన లేకపోవడంతో శుక్రవారం ‘చలో పంగులూరు’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాత్రి సైతం కార్యాలయం దగ్గరే వంటావార్పు ఏర్పాటు చేసుకొని అక్కడే నిద్రించారు. శనివారం కూడా యథాతధంగా తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే, ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయాలని భావించిన అధికారులు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను దించారు. అయినా, భయపడకుండా దళితులు పోరాటాన్ని కొనసాగించారు. దీంతో, ఉదయం 11.30 ప్రాంతంలో అద్దంకి ఆర్‌‌డిఒ విజయజ్యోతి కుమారి, దర్శి డిఎస్‌‌పి బాలమురళీకృష్ణ నూజిళ్లపల్లి దళిత పోరాట కమిటీ నాయకులను, కెవిపిఎస్‌ నాయకులను పిలిచి చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఆ‌ర్‌‌డిఒ విజయజ్యోతి కుమారి తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న దళితులతో మాట్లాడారు. దళితులు కోరుకున్నట్టు కాలనీ ప్రారంభంలో రోడ్డులో ‘అంబేద్కర్ నగర్’ అనే పేరుతో ఆర్చిని నిర్మించుకోవచ్చని, పంగులూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని రెండు రోజుల్లో నూజిళ్లపల్లి తీసుకువెళ్లి, ప్రస్తుతం దళితులకు అనుకూలమైన ప్రదేశంలో ఉంచి.. తరువాత ఏర్పాటు చేసుకునేందుకు సానుకూలంగా స్పందించారు. దీంతో, దళితులు తమ ఆందోళనను విరమించి తహశీల్దార్ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఆర్‌‌డిఒ విజయజ్యోతి కుమారి మాట్లాడుతూ ఆదివారమే సర్వేయర్‌ను నూజిళ్లపల్లి దళిత కాలనీకి పంపిస్తామని, వెంటనే కొలతలు వేయించి ఆర్చి నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. రోడ్డులో ఉన్న పైప్‌‌లైన్‌ ‌ధ్వంసం కాకుండా, వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్చి నిర్మాణం సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ సందర్భంగా దళితులకు మద్దతుగా నిలిచిన కౌలు రైతు సంఘం రాష్ట్ర మాజీ నాయకులు నాగబోయిన రంగారావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, వ్య‌కాస రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. బాలకోటయ్య మాట్లాడారు. ఆర్చి నిర్మాణంలోనూ, తర్వాత విగ్రహ ఏర్పాటులోనూ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్.మజుందార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నెరుసుల వెంకటేశ్వర్లు, మహిళా సంఘం నాయకులు కంకణాల రమాదేవి, ఉబ్బా ఆదిలక్ష్మి, నూజిల్లపల్లి దళిత పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్