శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దారి లేదు.. వెలుగు లేదు..

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:35 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సామాజిక శంఖారావం పాదయాత్రలో దళితుల దీనస్థితి

- 24న ధర్నాను జయప్రదం చేయాలని నేతల పిలుపు

ప్రజాశక్తి - యంత్రాంగం : స్మశాన వాటికకు వెళ్లే దారులు ఆక్రమణకు గురయ్యాయని, నేటికీ చీకటిలోనే నివసిస్తున్నామని పలువురు దళితులు తమ దీనస్థితిని సామాజిక శంఖారావంలో నాయకులు చేపట్టిన పాదయాత్రలో వెలిబుచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని కోరారు. 24న కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయపద్రం చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావంలో భాగంగా నాయకులు దళిత గ్రామాల్లో ప్రచార యాత్రలు, ధర్నా విజయవంతానికి కరపత్రాలు పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లా ​గూడూరు రూరల్ పరిధిలోనీ కాండ్ర, వెంకటేశు పల్లి, తిమ్మసముద్రం, కొండాగుంట, వెడిచెర్ల హరిజన, గిరిజన, అరుంధతి వాడలలో, గూడూరు పట్టణ ప్రాంతంలో బనిహీసాహెబ్ పేట, జడ్‌పి హైస్కూల్, షాదుపేట,అశోక్ నగర్,పాత బస్టాండ్, తదితర ప్రాంతాల్లో నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ధర్నా జయప్రదానికి కరపత్రాలు పంపిణీ చేశారు.అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్మశాన వాటిక లకు వెళ్లే దారులు ఆక్రమణలకు గురి అయ్యాయని, ఇప్పటికీ వీధిలైట్లు లేక కటిక చీకటిలో నివసిస్తున్నామని పలువురు దళితులు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష‍ులు ప్రసాద్‌ మాట్లాడుతూ... భూములు లేని నిరుపేదలకు సాగు భూములు ఇవ్వాలని, దళితల కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం 24న వ్యక్తిగత అర్జీలతో కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాలో పాల్గొన్నాలని కోరారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల, పరవాడ మండలం కలపాక, లంకెలపాలెం, పెద్ద ముషిడివాడ, కన్నూరు, రావాడ గ్రామాల్లోని దళితవాడల్లో కెవిపిఎస్‌ ‌నాయకులు పర్యటించారు. ఆయా చోట్ల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని బేతపూడి, గుండాలపాడు, పొనుగుపాడు, గొల్లపాలెం, ఫిరంగిపురంలోని క్రీస్తు నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజసంఘాలు బైక్‌ ‌ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ... జిఒ 1235 ప్రకారం దళితులకు స్మశాన స్థలం కేటాయించాలని కోరారు. ఇళ్లులేని వారికి మూడు సెంట్లు స్థలం, ఆరు లక్షలతో పక్కా గృహం నిర్మించాలని, ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. తిరుపతి లోని తిమ్మినాయుడుపాలెం, దిగువపాలెం, ఎగువపాలెం, స్కావెంజర్స్ కాలనీల్లో ఆటో మైక్ ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రతి కుటుంబం తమ సమస్యలపై వ్యక్తిగత అర్జీలతో 24వ తేదీన కలెక్టరేట్‌కు రావాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్