‘దేశమును ప్రేమించడమంటే.. మనుషులను ప్రేమించడమంటే....
ప్రజాశక్తి -విజయవాడ : మహాకవి గురజాడ జయంతికి వేలాది చిరు స్వరాలు, విలువల ముత్యాల సరాలయ్యాయి. తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత కవి.. ఘన వైతాళికుడు గురజాడ అప్పారావు 164 వ జయంతిని జాషువా సాంస్కృతిక వేదిక (జెఎస్‌వి) ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ దుర్గాపురంలోని పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య, సంగీత కళాశాల ఆవరణలో ‘వేలాది గొంతుకలతో దేశమును ప్రేమించుమన్నా’ గీతాలాపన కార్యక్రమం ఆద్యంతం ఉత్సుకతతో.. ఉత్తేజభరితంగా జరిగింది. కళాశాల ప్రాంగణం గురజాడ గీతం పల్లవించి పులకించింది. నగరంలోని పదుల సంఖ్యలోని పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాలలు ఒకే గళంగా ఆలపించిన ఆ ప్రజా గీతం దేశాన్ని ప్రేమించాలన్న పిలుపుగా, మనిషికి మనిషి తోడుగా నిలవాలన్న సందేశంగా, కుల.. మత.. జాతి భేదాలకు అతీతంగా అన్నదమ్ముల్లా మెలగాలన్న మానవతా స్వరంగా ప్రతిధ్వనించింది.
‘దేశమును ప్రేమించడమంటే.. మనుషులను ప్రేమించడమంటే.. సరిహద్దుల్లోని మట్టి కాదు.. హద్దులెరుగని మానవత’ అనే సార్వజనీన సజీవ సత్యాన్ని భావి భారత పౌరులు సగర్వంగా లయబద్ధంగా ఆలపించారు. జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి జాషువా జయంతి 28 వరకూ నిర్వహించనున్న కార్యక్రమాల కమిటీ చైర్మన్ డాక్టర్ జి.సమరం ప్రారంభిస్తూ కుల మత వైషమ్యాలు ప్రజల ఐక్యతను విచ్ఛిన్నంజేసే యత్నాల నేపథ్యంలో ఇలాంటి దేశభక్తిపూరిత కార్యక్రమాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మానవ విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ... గురజాడ, జాషువా మొదలగు తెలుగు జాతి వైతాళికుల స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. జెఎస్‌వి ప్రధాన కార్యదర్శి ఐజాక్ న్యూటన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, ఎపిఎన్‌జిఒస్ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు డి.సత్యనారాయణ రెడ్డి, అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు, కామ్రేడ్ జీఆర్కే - పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, శారదా కళాశాల పూర్వ ప్రిన్సిపల్ వి.సాంబిరెడ్డి, ప్రముఖ ఆర్ట్ డిజైనర్ గిరిధర్, సంధ్యారాణి, కె.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఎంబివికె నిర్వహణలో నడుస్తున్న పాటలబడి విద్యార్థులు- ప్రధాన శిక్షకులు వి.బాలరాజు, ప్రిన్సిపల్ బెజవాడ నాని నేతృత్వంలో పాడిన ‘దేశమును ప్రేమించుమన్నా..’ గీతాన్ని విద్యార్థులు ముక్తకంఠంతో కోరస్ పాడారు. అనంతరం ఆయా స్కూళ్ల నుండి కూడా అదే గేయాన్ని ఉత్తేజంగా ఆలపించారు. పదేళ్లు కూడా నిండని పిల్లను పండుముసలోడికిచ్చి పెళ్లి చేసే దురాచారాన్ని.. కన్యాశుల్కాన్ని నఖశిఖ పర్యంతం గర్హించే గురజాడ విరచిత ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ నృత్య రూపకాన్ని శ్రీనటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రముఖ నృత్య దర్శకులు, ‘కళారత్న’ పిళ్లా ఉమామహేశ్వరపా త్రుడు నేతృత్వంలో అత్యద్భుతంగా ప్రదర్శించి ఆహూతులందరి మన్ననలందుకున్నారు. జెఎస్‌వి బాధ్యులు సుహాసిని తొలుత అతిథులను ఆహ్వానించారు. ఎ.అజయ్ వందనసమర్పణ చేశారు. కార్యక్రమాన్ని గుండు నారాయణరావు తదితరులు పర్యవేక్షించారు.








కామెంట్‌లు (0)