- నలుగురు మృతి
- ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం
ప్రజాశక్తి- యంత్రాంగం : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో శనివారం అర్ధరాత్రి పిడుగుల వర్షం కురిసింది. దీంతో, పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన నాగమ్మ (61), అదే గ్రామానికి సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేకల వెంకాయమ్మ (63), పాలపాడుకు చెందిన డేరంగుల వెంకటయ్య (68), మోపువారిపాలేనికి చెందిన రైతు మజ్జిగ చిన్నకోటేశ్వరరావు (58) మృతి చెందారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. పెట్లూరివారిపాలెంలో వేప చెట్టుపై పిడుగుపడింది. దీంతో, దీనికింద ఉన్న రెండు ఆటోలు దెబ్బతిన్నాయి. అదే గ్రామంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు మొవ్వు వరకూ విరిగి నేలకూలింది. పల్నాడు జిల్లాలో ఎనిమిది మండలాల్లోనూ, గుంటూరు జిల్లాలో 12 మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. వర్షంతో గుంటూరులోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలవల్లోని మురుగు నీరు రోడ్లపై ప్రవహించింది. శ్రీకాకుళం నగరంలో అరగంట పాటు మోస్తరు వర్షం కురిసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో వరుసగా మూడో రోజూ ముసురు వాతావరణమే అలుముకుంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. విశాఖ నగరంలోని షీలానగర్, గాజువాక, కూర్మన్నపాలెం, వడ్లపూడి ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో చిరుజల్లులు పడ్డాయి.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : సిఎం
పిడుగుపాటుకు పల్నాడు జిల్లాలో నలుగురు మృతి చెందడం బాధాకరమని, పండుగ పూట నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జగన్ దిగ్ర్భాంతి
పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి చెందిన ఘటనపై వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్న కోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు గురై మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పండగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.








కామెంట్‌లు (0)