ఇద్దరు కార్మికులకు అస్వస్థత
ప్రజాశక్తి-ముసునూరు, నూజివీడు టౌన్ (ఏలూరు జిల్లా): మొక్కజొన్న విత్తనాల గొడౌన్లోకి వెళ్లిన కార్మికులు ఇద్దరు శ్వాస సమస్యతో అస్వస్థతకు గురై కుప్పకూలిన ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండల పరిధిలో మంగళవారం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన పి నరేంద్ర కుమార్, ఒడిశాకు చెందిన భైరవ సింగ్ మండల పరిధిలోని కాట్రేనిపాడులో ఓ ప్రైవేటు మొక్కజొన్న కంపెనీలో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం రోజులానే డ్యూటీకి హాజరైన వారు మొక్కజొన్న విత్తనాల గొడౌన్లోకి వెళ్లారు. లోనికి వెళ్లగానే ఊపిరాడక ఉక్కిరిబికిరవుతూ కేకలు వేశారు. ఇది విన్న సమీపంలో పని చేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోనికి వెళ్లగా అప్పటికే వారు అపస్మారక స్థితికి చేరుకొని ఉన్నారు. వెంటనే వారిద్దరినీ బయటకు తీసుకొచ్చి సమీపంలోని ముసునూరు పిహెచ్‌సికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాదరావు మాట్లాడుతూ గొడౌన్లలో విత్తనాలు నిల్వ చేసేందుకు ఏమైనా క్రిమి సంహారక మందులు వాడి ఉండొచ్చని, దానికి తోడు చాలారోజులుగా గాలి ప్రవేశించని పరిస్థితుల్లో ఆక్సిజన్ అందే పరిస్థితి ఉండదన్నారు. అందుకే వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.







కామెంట్‌లు (0)