- వారి కుటుంబాలను ఆదుకోండి
- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
- వేటకు వెళ్లేవారి ప్రాణ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సముద్రంలో మునిగి పోయిన మత్స్యకారుల జాడ తెలుసుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. సముద్రపు వేటకు వెళ్ళే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణ రక్షణ కల్పించాలని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ సముద్ర తీరంలో జులై నాలుగో తేదీ సాయంత్రం ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని, నేటికీ వారి ఆచూకీ తెలియని విషయాన్ని ఈ ప్రకటనలో ప్రస్తావించారు. వారి కుటుంబాలు రాత్రింబవళ్ళు సముద్ర తీరంలో రోదిస్తున్నాయని తెలిపారు. ఈ విషాద సమయంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున సంఘీభావం, సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గంగవరం సముద్ర తీరానికి 14 నాటికల్ మైళ్ళ దూరంలో వీరి పడవ తీవ్రమైన సముద్ర కెరటాలకు మునిగిపోయిందని, మునిగిపోయిన మత్సకారులను కాపాడలేకపోవటానికి కోస్ట్ గార్డ్ వైఫల్యమే ప్రధాన కారణమని తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది తక్కువగా ఉండటం, ఆధునిక బోట్లు లేకపోవటం వలన మత్సకారులను వెంటనే కాపాడలేకపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతి బోట్‌కి ఇచ్చిన జిపిఎస్‌లు పని చేయడం లేదని, నాణ్యత లేని చౌకరకం జిపిఎస్‌లు ఇచ్చి మత్సకారుల ప్రాణాలు బలిగొన్నారని తెలిపారు. జిపిఎస్ ద్వారా హెచ్చరికలు తెలిసి ఉంటే మత్సకారులు సముద్ర తీరానికి ముందుగానే చేరి ఉండేవారని తెలిపారు. ఆంద్రప్రదేశ్‌కు విశాలమైన 1005కిలో మీటర్ల సముద్రతీరం ఉందని, ఈ తీరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగించడంలో అత్యంత శ్రద్ద చూపిస్తున్నారని, దీనిలో కొంతైనా మత్స్యకారులపై చూపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాణరక్షణ చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. తీవ్రమైన సముద్ర అలల తాకిడికి ఏడుగురు మత్స్యకారులు ప్రయాణిస్తున్న మెకనైజ్డ్ బోట్‌లో యజమాని మరియు బోట్ డ్రైవరుగా పనిచేస్తున్న కారి చిన్న ఒక్కడే తీరం చేరుకోగలిగాడని, ఈయనను కాకినాడ పోర్ట్ వైపు వస్తున్న చైనా పనామా మర్చంట్‌షిప్‌లో ఉన్న 24 మంది కార్మికులు కాపాడారని తెలిపారు. విశాఖపట్నం తీసుకువచ్చి వైద్య సహాయం అందిస్తున్నారని వివరించారు. మిగిలిన ఆరుగురు కార్మికుల్లో ఐదుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారని వివరించారు. ఒకరు భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం గ్రామానికి చెందినవారు. వీరి ఆచూకి కోసం రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని శ్రీనివాసరావు కోరారు.







కామెంట్‌లు (0)