'పావనీ... టీ...` అంటూ హాల్లో సోఫాపై కూర్చొని ఫోన్ చూసుకుంటూ శ్రీధర్ పిలుస్తున్నాడు.
'ఆ... తెస్తున్నానండీ...` అంటూ ... పావని టీని తెచ్చి శ్రీధర్ కిచ్చింది.
'అమ్మా, నాన్న టీ తాగారా ?` అని అడిగాడు శ్రీధర్
'ఆ.. తాగారండీ.. వాళ్ల గదిలో కూర్చొని వార్తలు చూస్తున్నారు` చెప్పింది పావని.
'ఓకే` అంటూ ... శ్రీధర్ మళ్లీ ఫోన్లో నిమగ్నమయ్యాడు.
'ఏవండీ` .. అంటూ నిదానంగా పిలిచింది పావని.
'హా చెప్పు పావని ఏంటి ? ` అడిగాడు శ్రీధర్.
'మన బాబీ, సంజూల స్కూల్ బ్యాగులు బాగా పాతబడిపోయి చిరిగిపోయాయి.. కొత్తవి కొనాలండీ` అని అడిగింది పావని.
'కొత్తవా? అన్నీ తెలిసి కూడా ఎలా అడుగుతావు పావనీ.. నా ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడమే కష్టం... అయినా ఆ బ్యాగులు మరీ చిరిగిపోలేదులే... సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చిన తర్వాత వాటిని ఇవ్వు... కుట్లు వేయించుకొస్తాను..` అన్నాడు కాస్త చిరాగ్గా శ్రీధర్.
'ఏవండీ.. మీ సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది కదా.. నేను కూడా ఉద్యోగం..` అని పావని నిదానంగా కాస్త బిడియంగా అంటుండగానే..
'ఆ.. బి.ఎ చదివాను. ఉద్యోగం వెలగబెడతాను. నువ్వు పిల్లలకి బ్యాగులు కూడా కొనివ్వలేవు.. అని నన్ను ఎగతాళి చేస్తున్నావా, అంతేనా ?` అని ఇంకాస్త గొంతు పెంచాడు శ్రీధర్.
'నా ఉద్దేశం అదికాదండీ` అని పావని అంటుండగానే..'ఆ.. ఆ.. నీ ఉద్దేశాలు వినే తీరుబాటు లేదులే గాని.. వెళ్లి ఇంట్లో పనిచూడు` అని కసురుకున్నాడు శ్రీధర్.
వంటగదిలోకెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది పావని.. ఎవరూ చూడకముందే పైటకొంగుతో ఆ కన్నీళ్లను తుడిచేసుకుంది. ఇంతలో.. పిల్లలు ఇద్దరూ వచ్చి పావనీని అమ్మా అంటూ వాటేసుకున్నారు. 'అమ్మా! మేం రెడీ.. టిఫిన్` అంటూ ఇద్దరూ సందడి చేశారు.
'హాల్లోకి పదండమ్మా... మీకూ, మామ్మ, తాత, డాడీకి టిఫిన్ పెడతాను. సరేనా.` అంది పావని
'ఓకే అమ్మా...` అంటూ పిల్లలిద్దరూ పరుగెత్తుకుంటూ హాల్లోకి వెళ్లారు.
డైనింగ్ టేబుల్ పై అప్పుడే కూర్చున్న శ్రీధర్ ను చూసి... పిల్లలిద్దరూ డాడీ అనుకుంటూ ఒళ్లో వాలిపోయారు.
'డాడీ... స్కూల్ బ్యాగులు కొత్తవి కావాలి డాడీ` అని బాబీ బుంగమూతి పెట్టాడు.
'అవును డాడీ.. బ్యాగులు బాగా చిరిగిపోయాయి.. కొత్తవి కొను డాడీ` అని శ్రీధర్ చేతిని పట్టుకొని గారాబంగా అడిగింది సంజు.
'ఒకే.. ఒకే.. ముందు టిఫిన్.. తర్వాత బ్యాగులు గురించి.. డాడీ మాట వినాలి మరి..` అంటూ శ్రీధర్ ఇద్దరు పిల్లలను వాళ్ల కుర్చీల్లోకి పంపాడు.
డైనింగ్ టేబుల్ పై అందరూ కూర్చున్నారు. పావని అందరికీ వడ్డిస్తుంది. కానీ ఆమె ముఖం చిన్నబోయి ఉన్నట్లు గమనించాడు శ్రీధర్.
టిఫిన్ తిన్న తర్వాత వాషింగ్ బేషిన్ లో చేతులను కడుక్కుంటూ.. టవల్ అందిస్తున్న పావనితో 'చూడు పావనీ! ఇంట్లో ముసలివాళ్లయిన మా అమ్మానాన్నలు ఉన్నారు. ఇద్దరం ఉద్యోగాలకుపోతే వారిని ఎవరు చూసుకుంటారు. అనుకోకుండా వారికేమైనా అయితే ..! నలుగురికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి. ఎలాగో నా తంటాలు నేను పడుతున్నాను. అయినా నీకు ఇంటి పనే సరిపోతుంది.. ఉద్యోగం ఏం చేస్తావ్ చెప్పు..! వచ్చే జీతంలో పిల్లలకు బ్యాగులు కొంటానులే. నువ్వు కాస్త ముఖం మార్చు. చూడలేకపోతున్నా` అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
పనంతా అయ్యి పావని టిఫిన్ తినేటప్పటికి ఉదయం 11 అయ్యింది.. అప్పటివరకు పనిలో పడి పచ్చిగంగ కూడా ముట్టలేదు. ‘హమ్మయ్యా’ అంటూ . అప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంది. టేబుల్ పై డిష్ లో మిగిలిన చల్లారిపోయిన కాస్త టిఫిన్ ను ప్లేట్లో పెట్టుకొని, అప్పుడే కుర్చీలో కూర్చుంది.
'అమ్మా... పావనీ.. ఓ సారి ఇటురామ్మా ... ` అంటూ అత్త విశాలాక్షి పిలుపు. టిఫిన్ ప్లేటును అక్కడే బల్లపై పెట్టేసి ... అత్తామామల గదిలోకి వెళ్లింది పావని.
'అమ్మా.. పావని.. కాస్త టివి ఛానల్ మార్చి పాత తెలుగు సినిమా పెట్టమ్మా.. నాకు చూపు సరిగ్గా కనబడటం లేదు.. నంబర్ తప్పుపడిపోతుంది..` అంది అత్త.
‘సరే!’ నంటూ పావని రిమోట్ తీసుకొని టివి ఛానల్ మార్చి, సినిమా పెట్టి, తిరిగి టేబుల్ వద్దకు వెళ్లింది. టిఫిన్ తింటుండగా... పావని ఆలోచనలు కాస్త వెనక్కు వెళ్లాయి.
చదువుకున్న రోజులు, చేసిన సందడి.. బిఎ పూర్తయ్యాక .. 4 సంవత్సరాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం.. అప్పుడు ఏం కావాలంటే అవి వెంటనే కొనుక్కోవడం.. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇదిగో.. ఇలా..! ‘అప్పుడు నాకు అవసరమైనవన్నీ చాలా తేలిగ్గా కొనుక్కున్నా.. ఇప్పుడు నా పిల్లలకు కనీసం బ్యాగులు కూడా కొనివ్వలేకపోతున్నా ..!` అంటూ బరువెక్కిన గుండెతో లోతైన నిట్టూర్పు విడిచింది పావని. సాయంత్రం అయ్యింది. చెంగుచెంగున పరుగెత్తుకొచ్చే పిల్లలు ఆ రోజు దిగాలుగా నిదానంగా నడుచుకుంటూ వచ్చి బ్యాగులను సోఫాలపై పడేసి కిమ్మనకుండా కూర్చున్నారు. వాళ్లిద్దరినీ చూసి ఆశ్చర్యపోయిన పావని.. 'ఏమ్మా ... స్కూల్ లో ఏమైనా జరిగిందా ? ఎవరైనా ఏమైనా అన్నారా?’ అని ఆత్రంగా అడిగింది.
'నీ బ్యాగ్ చిరిగిపోయింద్రా.. అంటూ చింటూ, జానీ, బబ్లుగాడు కలిసి నా బ్యాగు చిరుగుల్లో చేతులుపెట్టి ఏడిపించారమ్మా` అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ బాబీ బాధగా చెప్పాడు.
'అవునమ్మా... బ్యాగుల కుట్లు చిరిగిపోతున్నాయి.. బుక్స్ జారిపోతున్నాయి. మా క్లాసులో కూడా నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారమ్మా’ అంటూ సంజూ కాస్త నిగ్రహంగా చెప్పింది. ఒక్కసారిగా పావని గుండె తల్లడిల్లిపోయింది. ఆ పరిస్థితిలో పిల్లలు ఎంత బాధపడి ఉంటారో తలుచుకొని కళ్లు చెమ్మగిల్లుతున్నా. కాస్త దిటవుగా ఉంటూ.. బాబీ, సంజూల మధ్య కూర్చుంది.
'చూడండి బాబీ, సంజూ .... ఇంకో 15 రోజుల్లో మీ డాడీకి జీతం వస్తుంది.. ముందు వెంటనే మీకు బ్యాగులు కొనిపిస్తాను.. ` అని పావని అంటుండగా...
పిల్లలిద్దరూ పావని ముఖాన్ని ప్రశ్నార్థకంగా చూశారు.
'ఏంటి ఇద్దరూ అలా చూస్తున్నారేంటీ .. అమ్మ మాట మీద నమ్మకం లేదా.. ఈసారి మీ డాడీతో ఫైట్ చేసైనా సరే మీకు కొత్త బ్యాగులు కొనిపిస్తా. ఓకేనా. అమ్మను కదా! నమ్మాలి. కాస్త నవ్వండ్రా..’అంటూ పావని ఇద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దులాడి కితకితలు పెట్టింది. అంతే ఆ ఇద్దరూ పిల్లల నవ్వులతో ఇల్లంతా వెలిగిపోయింది. అప్పటినుండి ఏ పని చేస్తున్నా పావని మెదడు తొలిచేస్తుంది. ‘ఎలాగైనా పిల్లలకు బ్యాగులు కొనాలి. కానీ ఎలా?’ అనుకుంది. ఇంతలో తన ఫ్రెండ్ రితిక గుర్తొచ్చింది. 'అది ఎన్నోసార్లు కాల్ చేసింది. నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఈ పనుల్లో ఫోన్ మాట్లాడాలన్న ఆలోచనే చచ్చిపోయింది. ఓసారి రితికను ఏదైనా హోం మేడ్ వర్క్ ఉందేమో అడిగితే ..!’ అనుకుందే తడవు వెంటనే రితికకు పావని కాల్ చేసింది.
'ఏంటే పావనీ! అమ్మో ఈరోజు ఎవడో చచ్చాడే..! పావనీ ఫోన్ చేయడమా ?` అంటూ రితిక వెటకారంగా మాట్లాడింది.
'చాల్లేవే ... వెటకారానికేం తక్కువలేదులే` అంది పావని విసుగ్గా.
'ఊరికే అన్నాలేవే...ఏం మేడం ... తమరికి సడన్ గా మేం గుర్తొచ్చాం..` అని అడిగింది రితిక.
'అవునే... ఓ చిన్న హెల్ప్ కావాలి..` అంది పావని
'ఏయ్ హెల్ప్ ఏంటే ... ఆర్డర్ వెయ్యి. ఇక్కడ రితిక పావని ఫ్రెండ్..!` అంది నవ్వుతూ రితిక.
'ముందు నేను చెప్పేది వినవే..` అని కాస్త నవ్వింది పావని.
'ఏదైనా ఇంట్లో చేసే వర్క్ ఉంటుందా ?` అంది పావని
`ఏ వర్క్ ఉన్నా మీ హస్బెండ్ ఒప్పుకోడు. నువ్వేమో సంసారం చదరంగం అని పాట వినిపిస్తావు` అంది సరదాగా రితిక.
'కాస్త సీరియస్ గా మాట్లాడవే...` అంది పావని
'ఒకే.. ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ రితిక ఉంది కదే.. చెప్పు కాస్త అమౌంట్ నీ అకౌంట్లో వేయమంటావా ? ` అడిగింది రితిక
'నిన్ను నేను డబ్బు అడిగానా ?` అంది కోపంగా పావని
'నేను నీ ఫ్రెండ్ నే.. నాకు ఆ చనువు లేదా? నన్ను బయటిదానిలా చూస్తున్నావ్ కదూ..` అంది రితిక
'లేదే.. అవసరం ఉంటే నేనే అడుగుతాను కదా.. నీ దగ్గర నాకు భయమేంటి? గట్టిగా కొట్టైనా లాక్కుంటా.సరే కానీ... ఇంట్లో ఉండి సంపాదించగలిగే ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పవే` అంది పావని.

'ఒకే... AI TOOL అని ఒక కోర్సు ఉందే.. చదువుతో సంబంధం లేదు.. కచ్చితంగా ఇంగ్లీషు రావాలనీ లేదు.. నీ టాలెంట్ తో ఎఐ టూల్స్ ను వాడాలి.. సంపాదించాలి... నీకు ఖాళీ ఉన్న టైంలోనే రోజులో కాస్త 3 గంటలు ఇచ్చావంటే చాలు.. అందరూ నిద్రపోయిన తర్వాతైనా సరే. నువ్వు బాగా మైండ్ పెట్టి ప్రాక్టీసు చేసి ఆ టూల్స్ ను నేర్చుకున్నావంటే ఈజీగా మనీ ఎర్నింగ్ చేస్తావే.. అన్నట్లు ఒక్క టూల్ నేర్చుకోవడానికి పెద్ద టైం పట్టదు.. ఓ 15 రోజుల్లో నేర్చుకోవచ్చు... ఇక పావనీలాంటోళ్లయితే ఇంకా తొందరగా నేర్చేసుకుంటారు.. ` అంది రితిక.
' హు... వివరణ బాగానే ఇచ్చావు కానీ... నేను బిఎ చదివాను... నాకు యూజ్ అవుతుందా?నేను చేయగలనా ? ` అంది పావని
' ఎందుకు చేయలేవే... పదో తరగతి చదువుకున్నవాళ్లు కూడా చేస్తున్నారు.. నువ్వు చేయలేవా? ఆల్ రెడీ మన ఫ్రెండ్ సుహాసిని ఇలాగే ఎర్న్ చేస్తుందే.. ఓసారి సుహాసిని కి కాల్ చేసి మాట్లాడు. నీకేమైనా అనుమానాలుంటే అవి కూడా పోతాయ్ ` అంది రితిక
'ఒకేనే... వెంటనే నాకు ఆ లింక్ సెండ్ చెయ్ ... ` అని అడిగింది పావని.
'ఓకే పావని బంగారం... ఆల్ ది బెస్ట్ ... మళ్లీ కాల్ చేస్తాను.. బై...` అని ఫోన్ పెట్టేసింది రితిక.
తన ఫ్రెండ్ సుహాసినికి కాల్ చేసి వివరాలన్నీ కనుక్కుంది పావని. ఇక ఆ రోజు నుండి AI TOOLS Course పై శ్రద్ధ పెట్టింది. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా టూల్స్ నేర్చుకునేది.. రాత్రి చాలా సమయం నిద్రను సైతం లెక్కచేయకుండా టూల్స్ ను నేర్చుకోవడం ప్రారంభించింది. రోజూ ఫోన్ లో బిజి అవుతున్న పావనిని చూసి ఓ రోజు శ్రీధర్ అడిగాడు.
'ఏంటి పావని ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫోన్ లో బిజీ అవుతున్నావ్... నిద్రపోకుండా ఏం చేస్తున్నావ్ ` అని అడిగాడు కోపంగా.
విషయమంతా వివరించింది పావని.
' ఓహ్ ... AI TOOLS సరిపోయింది.. ఇవన్నీ జరిగే పనులేనా? అనవసరంగా నిద్ర పోకుండా నేర్చుకుంటున్నావ్ ... నువ్వు సిక్ అయ్యావనుకో... ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడు ? చాలుచాల్లే ఇక నిద్రపో... ఇంకా ఏంటో అనుకున్నాను. పనికిమాలిన పనులు కాకపోతే ఏంటి ? హు..!` అనుకుంటూ చిరాగ్గా పడుకున్నాడు శ్రీధర్.
పావని మాత్రం నిద్రపోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా కోర్సు కంప్లీట్ చేసింది. 10 రోజుల్లో ఫోన్ లోనే కొన్ని టూల్స్ నేర్చుకొని.. ఓ మంచి బ్యానర్ ను డిజైన్ చేసి అవసరం ఉన్న ఓ కంపెనీకి సెండ్ చేసింది. అది చూసి నచ్చిన కంపెనీ ఓనర్ వెంటనే పావనీ అకౌంట్ కు రూ.2 వేలు అమౌంట్ వేశారు. పావని ఫోన్లో టెక్ట్స్ మెసేజ్ ..! వచ్చింది.
'రూ.2 వేలు నా అకౌంట్లోనా ?` నమ్మలేకపోయింది పావని. మళ్లీ కళ్లు నులుముకొని తీక్షణంగా మెసేజ్ ను చూసింది..
'అవును.. నిజమే నా అకౌంట్లో చాన్నాళ్లకి అమౌంట్ ..!` అనుకొని వెంటనే తన బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అక్షరాలా రూ.2 వేలు ..!
పావని కళ్లు ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయ్యాయి. గుండె గంతులు వేసింది.. ఊపిరిలో నుండి ఏదో బాధ బయటకు బై బై అని చెప్పినట్టనిపించింది..!ఆ రూ.2 వేలు పావని కష్టార్జితం మాత్రమే కాదు.. కొన్ని ఏళ్ల తర్వాత ఆమెకు తిరిగి దొరికిన ఆత్మ విశ్వాసం..!
మరుసటి రోజునే బాబీ, సంజూలకు కొత్త బ్యాగులు, షూలు కొనేసింది పావని. బ్యాగులను, షూ లను చూసిన శ్రీధర్ ఆశ్చర్యపోయాడు.
'నేను పావనీకేం డబ్బివ్వలేదే..
ఇవెక్కడివి ?` అనుకుంటూ పావని దగ్గరకు వెళ్లాడు. పావనీని అని అడిగాడు అనుమానంగా శ్రీధర్.
'అవి నా సంపాదన.. నా స్వాభిమానం..` అని సగర్వంగా చెప్పింది పావని.
ఒక్క క్షణం శ్రీధర్ మిన్నకుండిపోయాడు..!‘ నీ పట్టుదల గురించి మీ పేరెంట్స్ ఎక్కువగా చెబుతుండేవారు. ఇప్పుడు కళ్లారా చూశాను.. ఇక నుండి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా!’ అంటూ ... క్యారేజి తీసుకొని ఆఫీస్ కి వెళ్లాడు. ఆరోజు నుండి ఇంట్లో అందరూ పావనీని కొత్తగా చూడటం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆమెను గౌరవించడం ప్రారంభించారు. కానీ పావనీలో మాత్రం ఏమార్పూ రాలేదు. తనకు గౌరవాన్ని ఇచ్చిన పనిని ఆపలేదు. ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులను చేసి పంపడం ప్రారంభించింది. ఈసారి పావని అకౌంట్లో రూ.10 వేలు వచ్చాయి. ఆశ్చర్యపోయింది..! ఇకపై పిల్లల విషయంలో తనకు బెంగ లేదనుకుంది.. చెమ్మగిల్లిన కళ్లతో వెంటనే తన ఫ్రెండ్ రితికకు ఫోన్ చేసింది.
'రితిక... చాలా థాంక్సే..` అంది పావని
'ఏయ్... చంపుతా బిడ్డా ... ఏంటే కొత్తగా థాంక్స్ లు చెపుతున్నావ్ ...` అంది రితిక కోపంగా.
'ఆగవే ... నువ్వు చూపించిన మార్గంలో వెళ్లాను.. ఈరోజు నన్ను నేను మళ్లీ పొందాను` అంది పావని
'ఏమే పావని .. ఏం చెప్పావో ఒక్క మాట అర్థమైతే ఒట్టే.. కాస్త అర్థమయ్యేలా చెప్పవే ` అంది రితిక.
'ఒసేయ్ ... పిచ్చి... నువ్వు నాకు AI TOOLS Link ఇచ్చావుగా ...` అంది పావని
'ఆ ఇచ్చాను.. అయితే` ... అని రితిక అంటుండగానే..
'ఆ టూల్స్ ను నేర్చుకున్నానే.. కొన్ని డిజైన్లు చేశాను.. మొదట కాస్త భయం వేసినా ధైర్యం చేసి పంపాను.. అవి సక్సెస్ అయ్యి మొదట రూ.2 వేలు వచ్చాయి... ఆ సంగతి నీకు చెప్పే లోపే ... వెంటనే మరో డిజైన్ కి రూ.10 వేలు వచ్చాయే` అని ఆనందంగా చెప్పింది పావని.
'ఏహే... నువ్వు సక్సెస్ అవుతావని నాకెప్పుడో తెలుసే.. పావని టాలెంట్, పట్టుదల నాకు తెలియదా ?` అంది రితిక
పకపకా నవ్వింది పావని.
కొన్నాళ్లు గడిచాయి.. ఎఐ టూల్స్ నేర్చుకున్న పావని, తన ఫ్రెండ్స్ రితిక, సుహాసినిలతో కలిసి నిదానంగా ఓ అకాడమీని ప్రారంభించింది. తమలాంటి ఎంతోమంది మహిళలకు వారు స్ఫూర్తిగా నిలిచారు. ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లి ఉద్యోగం చేయలేకపోతున్నామంటూ బాధపడుతున్న మహిళలందరికీ ఎఐ టూల్స్ ను నేర్పుతూ సొసైటీలో మంచి పేరు సంపాదించారు. ఓ రోజు ఓ మహిళా సమావేశానికి పావని, రితిక, సుహాసినిలకు ఆహ్వానం అందింది. ఆ రోజున స్టేజీ పై ఎక్కి మైకు అందుకున్న ఫ్రెండ్స్ తమ అనుభవాలను మహిళలందరితో పంచుకున్నారు. రితిక, సుహాసినిల తర్వాత పావని స్టేజ్ ఎక్కి మైక్ ను అందుకుంది. అందరికీ నమస్కరించింది.
' నేను పెద్ద వ్యాపారవేత్తను కాను.. ఒక సాధారణ గృహిణిని. ఒక మహిళ ఇంటి బాధ్యతల మధ్య తనను తాను కోల్పోకూడదు. తన విలువను తాను గుర్తించాలి. అప్పుడు ఆమె జీవితంలో అసాధ్యం అనే మాటకు చోటుండదు. ఓ మహిళ సంపాదిస్తుంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే కాదు... ఆమె ఆత్మవిశ్వాసం.. స్వాభిమానం..! కూడా ` అంది పావని. ఆ మాటలకు సభలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ముగ్గురు స్నేహితురాళ్లను అభినందించారు. అప్పుడు పావని మనసులో మెల్లగా ఓ స్వరం వినబడుతుంది... ' నేను గెలిచింది డబ్బును కాదు ... నన్ను నేను గెలుచుకున్నాను ` అని.
ఎస్.ఉమామహేశ్వరి
63019 12215








కామెంట్‌లు (0)