రన్నింగ్ టెస్ట్‌లో కుప్పకూలి ‘చిక్కోలు’ యువకుడు మృతి
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ ఆర్‌కె బీచ్ రోడ్డులో జరుగుతున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దేశసేవ చేయాలనే లక్ష్యంతో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరైన శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శేషగిరిరావు (19) శారీరక సామర్థ్య పరీక్షలో భాగంగా నిర్వహించిన 1.6 కిలోమీటర్ల రన్నింగ్ టెస్ట్‌లో పాల్గొంటూ తీవ్ర అస్వస్థతకు గురై ట్రాక్‌పై కుప్పకూలిపోయారు. ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆ యువకుడు మృతి చెందారు. ఈ ఘటనతో ర్యాలీ ప్రాంగణంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది.
పోలీసులు ప్రాథమిక వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా గుండె సంబంధిత సమస్య తలెత్తిందా? డీహైడ్రేషన్ లేదా ఇతర ఆరోగ్య కారణాలతో అస్వస్థతకు గురయ్యాడా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి కచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శేషగిరిరావు మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొంటున్న అభ్యర్థుల భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.








కామెంట్‌లు (0)