ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆదర్శ రైతు దుర్మరణం

18 నిమిషాల క్రితం

7dd3571b-0fcb-4a3b-b5e6-622a16bd1000.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 08:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం

ప్రజాశక్తి-అద్దంకి: నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదర్శ రైతు మృతి చెందారు. శాంతినగర్‌-శ్రీనివాసనగర్‌ గ్రామాల మధ్య గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన దేవినేని కోటేశ్వరరావు (54) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానిక సీఐ ఆరాధ్యుల సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోటేశ్వరరావు మండలంలో ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. ఆధునిక పద్ధతుల్లో షేడ్‌నెట్‌ సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆదివారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రంలో పనుల నిమిత్తం కూలీలను పురమాయించేందుకు ఎక్స్‌ప్రెస్‌వేపై బయలుదేరారు. ఈ క్రమంలో శాంతినగర్‌-శ్రీనివాసనగర్‌ గ్రామాల మధ్యకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

ఆదర్శ రైతుగా పేరుపొందిన కోటేశ్వరరావు ఆకస్మిక మృతితో శ్రీనివాసనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని జెడ్పీటీసీ సభ్యుడు మానం మురళీమోహన్‌ దాస్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు మండల వెంకట్రావు, శింగరకొండ ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు నూతి ప్రసాద్‌ తదితరులు సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్