హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపిఎస్‌పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రి పాలైనట్లు.. సోమవారం రోజంతా ప్రచారం జరగ్గా, అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమే ఇలా చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా ట్రైనీ ఐపిఎస్ ఫిర్యాదు చేయటంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్‌పేట్‌లోని స్నేహితురాలి గదికెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతో అపస్మారకస్థితిలోకి చేరాడు. సోమవారం ఉదయం నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండటంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించి అతని సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి, మరికొందరు మిత్రులు ఉదయం 9.30 గంటలకు ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు.. రక్త నమూనాలను పరీక్షకు పంపారు. రక్తంలో ఎలాంటి విషపదార్థం లేదని నివేదిక రావడంతో.. తనపై వచ్చిన వేధింపుల కేసును పక్కదారి పట్టించేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి నాటకమాడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్‌నోట్ రాసినట్టు భావిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి.. ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీసు అకాడమీ అధికారులతో సమావేశమయ్యారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించనున్నారు.
‘నాపై ఆరోపణలు నిరాధారం’ ....
మహిళా ట్రైనీ ఐపిఎస్‌తో ఏడాదిగా తన స్నేహం కొనసాగుతోందని, తాను ఆత్మహత్యకు యత్నించడానికి ఆమెతో పాటు నలుగురు కారణమని ఉదయ్‌కృష్ణారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆమె తనతో వాట్సప్‌లో చాటింగ్ చేసినట్టు ఆధారాలున్నాయన్నారు. తామిద్దరం కలిసి ఉన్న వీడియోలు ఆమె భర్తకు పంపినట్లు తెలిపారు. వీటికి భిన్నంగా ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ఆమెతో పరిచయమైనప్పటి నుంచి జరిగిన ఘటనలకు సాక్ష్యాలన్నీ తన ఫోన్‌లో ఉన్నాయన్నారు. అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉదయ్‌కృష్ణారెడ్డి పోస్టుపెట్టారు. తనపై వచ్చిన ఫిర్యాదులు నిరాధారమని, న్యాయం గెలుస్తుందని విశ్వసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తన సోదరుడిపై జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు.








కామెంట్‌లు (0)