మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘విలీనం’పై శివసేన (యుబిటి) పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం

4 గంటల క్రితం

supreme-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 03:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎంపిల ‘ఏకపక్ష‍ విలీనానికి’ స్పీకర్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఎదుట శివసేన (యుబిటి) తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ మౌఖికంగా వాదనలు వినిపించారు. ఎంపిలు మాతో లేనందున పార్లమెంటులో తమ రాజకీయ పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయని, వేరే పార్టీతో విలీనాన్ని స్పీకర్‌ గుర్తించారని అన్నారు. ఇది పార్లమెంట్‌ సమావేశాల కోసం ఉద్దేశించినదని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి విలీనాలు జరుగుతున్నాయని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి ఎమ్మెల్యేల భావప్రకటనా స్వేచ్ఛను, పార్టీ అంతర్గత అసమ్మతిని కాపాడటానికి ఉద్దేశించిన విలీనం అనే సాధనం, ఇప్పుడు బేరసారాలకు ఒక ముసుగుగా మారిపోయిందని అన్నారు. ఏ విలీనమైన రాజకీయ పార్టీ స్థాయిలో జరగాలి కానీ, ఎమ్మెల్యేల పార్టీ స్థాయిలో కాదనే నిబంధనను ఎమ్మెల్యేలు పక్కనపెట్టారని అన్నారు. అసలు రాజకీయ పార్టీలో విలీనం కాకుండా ఆరుగురు ఎంపిలు ఏకపక్ష‍ంగా విలీనం కావాలని నిర్నయించుకున్నారు. ‘‘మేము ప్రత్యర్థి పార్టీలో విలీనమయ్యాము’’ అని ప్రకటించారని, ఎవరిపై అయితే పోటీ చేశారో .. అదే పార్టీలో చేరారని దేవదత్‌ కామత్‌ కోర్టుకు తెలిపారు. ఇటీవల రాఘవ్‌ చద్దా సహా ఆరుగురు ఆప్‌ ఎంపిలు బిజెపిలో చేరిన సంగత తెలిసిందే. ఈ చర్యను కూడా ‘విలీనం’గా ప్రకటించారు.


శివసేన (యుబిటి) వాదన ప్రకారం, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరో పార్టీలో విలీనం కావచ్చు గానీ, కేవలం కొంతమంది శాసనసభ్యులు లేదా ఎంపీలు స్వతంత్రంగా పార్టీని విలీనం చేసినట్లు ప్రకటించలేరు. అసలు రాజకీయ పార్టీ విలీనం కానప్పుడు, కేవలం శాసనసభా పక్షం విలీనం చట్టబద్ధం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుభాష్ దేశాయ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో 2023లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు.

కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోడంకర్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రస్తుతం పరిశీలిస్తోంది. చోడంకర్‌ తరపున న్యాయవాది ముహమ్మద్ అలీ ఖాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ .. బాంబే హైకోర్టు జనవరి 16, 2025 నాటి నిర్ణయాన్ని సవాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడాన్ని హైకోర్టు ఒక చెల్లుబాటు అయ్యే 'విలీనం'గా పరిగణించింది. తక్కువ ప్రాధాన్యత కలిగిన ఎమ్మెల్యేల వర్గంలోని మెజారిటీ సభ్యుల అనాలోచిత నిర్ణయాలపై అసలు రాజకీయ పార్టీని వదిలేస్తే "అసాధారణ పరిస్థితులు" తలెత్తుతాయని చోడంకర్ వాదించారు. చోడంకర్‌ కేసును ప్రస్తావిస్తూ.. ఈ చట్టపరమైన అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని న్యాయవాది దేవదత్‌ కామత్‌ కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్