గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ఆందోళనకు సిఐటియు మద్దతు
700 మంది ఉద్యోగాలు ఊడగొట్టడం న్యాయమా : కె ఉమామహేశ్వరరావు
ప్రజాశ క్తి - తాడేపల్లి (గుంటూరు జిల్లా) : అవుట్‌సోర్సింగ్ విభాగంలో తొలగించిన 700 మంది ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డులోని రాష్ట్ర గురుకుల పాఠశాలల ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం గురుకుల ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. గత మూడు రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు రాత్రి పగలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చర్చలకు పిలిచి గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం సరైనది కాదన్నారు.
గురుకుల ఉపాధ్యాయుల పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కార్మిక సంఘాల అన్నింటిని కూడగట్టి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం జీతాలు పెంచుతాం, ఉద్యోగాలు ఇస్తాం, ఉన్న ఉద్యోగులను తొలగించబోమని అధికారంలోకి రాకముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారని, గద్దెనెక్కాక వీటిని వదిలేసి, అందర్నీ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. సిఐటియు నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, పల్లె కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు డివి భాస్కర్ రెడ్డి, డి విజయబాబు, బర్నబాస్, ఉపాధ్యాయులు పరమేశు, మల్లికార్జున నాయక్, విజయ్ కుమార్ నాయక్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)