కొత్త డోనర్ పాలసీ అమలుకు ముందు టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు
ప్రజాశక్తి – తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్టులకు కొత్త డోనర్ పాలసీ అమలుకు ముందు రోజు భక్తులు భారీ ఎత్తున విరాళాలు సమర్పించారు. మంగళవారం ఒక్కరోజులోనే రూ.96 కోట్ల 98 లక్షల విరాళాలు అందగా, ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక విరాళాల్లో ఒకటిగా నిలిచింది. టిటిడిఅధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆన్‌లైన్ ద్వారా 2,354 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 106 మంది భక్తులు విరాళాలు సమర్పించారు. మొత్తంగా 2,460 మంది దాతలు వివిధ ట్రస్టులకు తమ విరాళాలను అందజేశారు.
విరాళాల వివరాల్లో రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల లోపు 1,212 మంది దాతలు విరాళాలు సమర్పించగా, రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు 1,246 మంది భక్తులు విరాళాలు అందించారు. అలాగే రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇద్దరు భక్తులు విరాళంగా సమర్పించినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి టిటిడి కొత్త డోనర్ పాలసీ అమల్లోకి రావడంతో, పాత విధానంలో ఉన్న ప్రయోజనాలను పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ముందుగానే విరాళాలు సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. సామాన్య భక్తుల దర్శన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని డోనర్ ప్రివిలైజెస్‌లో మార్పులు చేస్తూ టిటిడి బోర్డు ఇటీవల కొత్త విధానాన్ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం దాతలకు కల్పించే కొన్ని ప్రత్యేక సదుపాయాలను పరిమితం చేయడంతో పాటు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
టిటిడి గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జూన్ 26 నాటికి మొత్తం 1,97,888 మంది దాతలుగా నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.









కామెంట్‌లు (0)