గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో తగ్గని రద్దీ

28 జూన్, 2026

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆరు కిలోమీటర్ల లైన్లో యాత్రికుల పడిగాపులు

ప్రజాశక్తి - తిరుమల : తిరుమల కొండ కిటకిటలాడు తోంది. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 27వ తేదీ శనివారం 85,582 మంది యాత్రికులు స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానానికి ఆ ఒక్క రోజే హుండీ ద్వారా రూ.3.43 కోట్ల ఆదాయం అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం వరకూ క్యూలైన్ ఉంది. టోకెన్ లేని సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే రూ.4.66 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అదే స్థాయిలో 3.43 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టిటిడి అధికారులు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర గంటల తరబడి నిలిచిపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలిపిరి వద్ద ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయడం తప్పనిసరి. లగేజీ స్కాన్ చేయడం, నిషేధిత వస్తువులు లేవని నిర్ధారించుకోవడం వంటి భద్రతా నియమాల వల్ల సహజంగానే కొంత సమయం పడుతోంది. పీక్ సీజన్‌లో ఒకేసారి వేలాది ప్రైవేట్ వాహనాలు అలిపిరి సెక్యూరిటీ చెక్ పోస్టు వద్దకు వచ్చాయి. కపిలతీర్థం, లీలామహల్ బైపాస్ రోడ్లపై భారీగా వాహనాలు కనిపించాయి. ఈ పరిణామాలపై అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్‌ వద్ద క్యూలైన్లను పర్యవేక్షించారు. తిరుమలలో సాధారణ రోజుల్లో సైతం రోజుకు సగటున 85 వేల నుంచి 87 వేల మంది యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. సాధారణ యాత్రికులకు ఎక్కువ సమయం కేటాయించేం దుకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలు, ఆన్‌లైన్‌లో ఏరోజుకారోజు కరెంట్ బుకింగ్లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను రద్దు చే‌శామని తెలిపారు. ఎస్‌ఎస్‌డి తదితర దర్శనాల కోటాలను అవసరానికి అనుగుణంగా తగ్గించి, ఆ సమయాన్ని సర్వదర్శనం యాత్రికులకు వినియోగిస్తున్నామని వివరించారు.

టిటిడికి రూ.27.5 కోట్ల విలువ చేసే బస్సులు ఇస్తామన్న అనంత్ అంబాని

రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబాని కుమారుడు అనంత్‌ అంబాని ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం తరహాలోనే తిరుమలలోని టిటిడి గోశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అనంత్ అంబాని అంగీకారం తెలిపారు. అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని టిటిడి అదనపు ఇఒ వెంకయ్య చౌదరి కోరారు. ఈ మేరకు సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వాటి నిర్వహణకు 50 మంది డ్రైవర్లను వారికి అయ్యే జీతభత్యాలను సైతం రిలయన్స్ సంస్థ భరిస్తుందని తెలిపారు. వీటితో పాటు తిరుమల కొండపై ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్లను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంత్‌ అంబానికి స్వామివారి తీర్ధ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని టిటిడి అదనపు ఇఒ అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్