- ఎపి కౌలు రైతుల సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కౌలు రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల వరకు హామీ లేని పంట రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రములో ఆర్ఎంజి, జెఎల్జి గ్రూపు సభ్యులకు పంట రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అందడం లేదన్నారు. రెండు లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ మర్గదర్శకాలు రాష్ట్రంలో అమలు జరగటం లేదని పేర్కొన్నారు. ఆర్‌బిఐ మార్గదర్శకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, బ్యాంకులకు ఉందన్నారు. కనీసం బ్యాంకు రుణాలు సక్రమంగా తిరిగి చెల్లిస్తున్న గ్రూపులకు, సభ్యులకు కూడా లక్షకు మించి పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు రకరకాల ఆంక్షలు పెడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో చర్చించి హామీలు లేని పంట రుణాలు గ్రూపు సభ్యులకు కూడా రెండు లక్షల వరకు ఇచ్చేటట్లుగా, అదనంగా అవసరమైన వారికి షూరిటీ పెట్టుకుని 5 లక్షల వరకు పంట రుణాలు ఇచ్చేటట్లుగా చర్యలు తీసుకోవలసినదిగా కోరారు. ఈ సందర్భంగా రాజేశేఖర్ స్పందిస్తూ.. ఎస్ఎల్‌బిసి అధికారులతో మాట్లాడి పంట రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని తెలిపారు.








కామెంట్‌లు (0)