బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలీసు శాఖలో పోస్టులు భర్తీ చేయాలి

1 రోజు క్రితం

dyfi5
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 10:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కాకినాడలో కదం తొక్కిన నిరుద్యోగులు

  • కలెక్టరేట్ వద్ద ధర్నా

ప్రజాశక్తి - కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ లేని పక్షంలో 'చలో విజయవాడ` నిర్వహిస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ ‌వద్ద మంగళవారం ధర్నా చేశారు. తొలుత కొండయ్యపాలెం బ్రిడ్జి జెండా సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో టిడిపి కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. గతంలో 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖమంత్రి అనిత ప్రకటించారని గుర్తుచేశారు. నేడు కేవలం 2,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. కనీసం పది వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయస్సు35 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్‌‌లో జాబులే లేవన్నారు. నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఢిల్లీ పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి పోస్టులు పెంచకపోతే 'చలో విజయవాడ`ను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరేంధిర ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు టి రాజా, వాసు, సత్యం, జయరాం, ఆదర్శ కార్తీక్, రాజు, రామకృష్ణ, నిరుద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్