18 ఏళ్లు నిండిన వారికి ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలి
మంత్రి నిమ్మలకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి కోరారు. ఈ మేరకు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అసెంబ్లీలో వినతిపత్రం అందించారు. నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. గ్రామాల వారీ అర్హుల జాబితాను తయారుచేసి బహిరంగంగా ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస ప్యాకేజీలను తక్షణమే చెల్లించాలన్నారు. గెజిట్‌లోనూ, ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాలోనూ చేరని కుటుంబాలు సుదీర్ఘకాలంగా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పరిశీలించలేదని తెలిపారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని కోరారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, పారిశుధ్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలనూ పూర్తి చేయాలన్నారు. నిర్వాసితుల గృహ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, వారికి నివాసాల కోసం కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని కోరారు. భూములు కోల్పోయిన కుటుంబాల యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిర్వాసితుల సంఘాల ప్రతినిధులను అందులో చేర్చాలని కోరారు.
ప్రత్యేక టెట్‌లో ఉపాధ్యాయులకు కనీస మార్కులు పెట్టాలి
ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్‌లో కనీస మార్కులను అర్హత పెట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అసెంబ్లీలో గోపిమూర్తి కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన టెట్ సిలబస్‌లో 130 నుంచి 135 మార్కుల వరకు ఆయా ఉపాధ్యాయుల సబ్జెక్టుకు సంబంధం లేదన్నారు. ఉత్తీర్ణత మార్కులు కులాల వారీ రావాలంటే కష్టమని, అలా కాకుండా అందరికీ కనీస అర్హత మార్కుల నిబంధన తీసుకురావాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విద్యాహక్కు చట్టంలోని 23(1)ను సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని లోకేష్‌కు మరో వినతిపత్రం అందించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్టేషన్లో సిపిఎస్ ఉద్యమంలో భాగంగా 16 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పెట్టిన కేసును రద్దు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితను కోరారు.







కామెంట్‌లు (0)