గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమయం లేదు..ఖాళీ చేయాల్సిందే!

1 గంట క్రితం

WhatsApp Image 2026-08-13 at 21.35.15.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 18 ఏళ్ల ప్యాకేజీ కూడా లేదు

  • నెలాఖరుకే నీళ్లు విడుదల చేస్తాం : మంత్రి నిమ్మల

  • ఖాళీ చేయబోమన్న వెలిగొండ నిర్వాసితులు

ప్రజాశక్తి - మార్కాపురం : గ్రామాలను ఖాళీ చేయడానికి సమయం ఇవ్వాలని వెలిగొండ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టగా.. తమ డిమాండ్లు నెరవేరుస్తారని నిర్వాసితులు ఆశపడ్డారు. ఆయన కోసం గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు. తీరా సమీక్ష పూర్తి అయిన తర్వాత మంత్రి మాటలు వారిని తీవ్ర నిరాశపరిచాయి. సమయం ఇవ్వబోమని, 2019 తర్వాత నుంచి 2026 వరకు మధ్యలో 18 ఏళ్లు నిండిన వారికి కూడా ప్యాకేజీ ఇవ్వబోమని తేల్చిచెప్పారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడత (ఫస్ట్ ఫేజ్) పనులను పూర్తి చేసి ఈ ఆగస్టు చివరి నాటికే నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీంతో వెలిగొండ నిర్వాసితుల ఆగ్రహం పెరిగింది. తాము గ్రామాలు ఖాళీ చేయబోమని తెగేసి చెప్పారు.

`​నిర్వాసితుల సహనానికి మంత్రి పరీక్ష

మంత్రి నిమ్మల రాక విషయం తెలుసుకున్న ముంపు గ్రామాల నిర్వాసితులు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మార్కాపురం కలెక్టరేట్ వద్దకు ఉదయమే చేరుకున్నారు. మధ్యాహ్నం సమయానికి వందలాదిగా గుమిగూడారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత వచ్చి మాట్లాడుతానని చెప్పడంతో నిర్వాసితులంతా వేచి ఉన్నారు. ఓ దశలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ద్వారా కొందరిని మంత్రి లోపలికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగిన చర్చల్లోనూ సానుకూలత కనపడలేదు. అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాల్సిన నిర్ణయమని కొట్టిపారేశారు. కనీసం సమయం ఇవ్వకుండా... అందరికీ ప్యాకేజీ చెల్లించకుండా... మిస్సయిన వారి పేర్లు ఆర్‌ అండ్‌ ఆర్ ప్యాకేజీలో చేర్చకుండా.. 2026 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల ప్యాకేజీ సంగతి కూడా తేల్చలేదు. సుమారు 7000 మందికి పునరావాసం కూడా లేకుండా వెలుగొండ ప్రాజెక్టు నీటిని ఎలా విడుదల చేస్తారని నిర్వాసితులు ఓవైపు నిలదీస్తున్నా..ఆందోళనకారులకు సమాధానం చెప్పే ధైర్యం లేక రాత్రి వరకూ మంత్రి కలెక్టరేట్లోనే ఉండిపోయారు. ఈ ఆందోళనకు మద్దతుగా ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య పాల్గొనగా, సిపిఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య నాయకత్వం వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్