- జెఎసి సమావేశంలో ఒప్పుకున్న యాజమాన్యం
- 42 వేల మంది కార్మికులపై ప్రభావం
రాష్ట్రంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఆర్‌టిసిలో కార్మిక చట్టాల ఉల్లంఘన జరిగింది. ఇటీవల జరిగిన జెఎసి సమావేశంలో ఆసంస్థ యాజమాన్యమే ఈ విషయాన్ని ఒప్పుకుంది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉల్లంఘనల కారణంగా సంస్థలోని 42 వేల మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిఉంటుందని అంచనా! ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మిక చట్టాలు వర్తించబోవని, అసోసియేషన్లు పెట్టుకోవాలని ఇప్పటి వరకు బుకాయిస్తూ యాజమాన్యం ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన జెఎసి సమావేశంలో 18వ అంశంగా ఆర్‌టిసి యాజమాన్యం ఈ విషయాన్ని కూడా చేర్చింది. కార్మిక చట్టాలు అమలుపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొంది. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మిక చట్టాల అమలును పూర్తిగా నిలిపేశారు. చట్టాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కార్మిక సంఘాలను రద్దుచేసుకుని అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుంటేనే చర్చిస్తామని అధికారులు ఆయా సంఘాలకు నోటీసులు కూడా ఇచ్చారు. దీనిపై అప్పట్లోనే ఆర్‌టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యుఎఫ్) ప్రశ్నించింది. చట్టాలు అమలవుతాయని, కార్మిక హక్కులను కాలరాస్తున్నారనీ తెలిపింది. ఫెడరేషన్ నాయకులు ఘనీ దీనిపై కార్మికశాఖకు లేఖ రాశారు. అసలు చట్టాలు అమలు అవుతాయా లేదా తెలపాలని కోరారు. దీనికి స్పందించిన కార్మికశాఖ కమిషనర్ ఆర్‌టిసిలో కార్మిక చట్టాలు ఉన్నాయని, కానీ వాటిని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. కార్మిక శాఖ మెమో నెంబరు ఈ/3308022/2026 ద్వారా 2023 డిసెంబరు 20వ తేదీనే గుంటూరు జాయింట్ లేబర్ కమిషనర్ ఆర్‌టిసి యాజమాన్యానికి స్పష్టం ఇచ్చారనీ పేర్కొన్నారు. 2024 జనవరి నాలుగోతేదీన ఆర్‌టిసి యాజమాన్యానికి తాము రాసిన లేఖ అందిందనీ వివరించారు. ఆర్‌టిసి కార్మికులకు 2019 చట్టం 36లో సెక్షన్ 36 ప్రకారం అన్ని లేబర్ చట్టాలు వర్తిస్తాయని తెలిపారు. 2023 నుండి ఇప్పటి వరకూ కార్మిక చట్టాలు అమలు చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని జాయింట్ లేబర్ కమిషనర్‌కు కమిషనర్ గంధం చంద్రుడు మెమో కూడా ఇచ్చారు. రెండేళ్ల నుండి చట్టాల అమలును పూర్తిగా నిలిపేసినా ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాలని కోరారు. వెంటనే అమలు చేయడానికి ఏమి చేస్తారు ? ఆలస్యానికి కారణం ఏమిటో సాక్ష్యాలతో సహా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్‌టిసి తీరుపై గతంలోనే ఆర్‌టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యు ఎఫ్), ఎంప్లాయీస్ యూనియన్(ఈయు) కోర్టులో కేసులు దాఖలు చేశాయి. దీనిపై వచ్చే నెల 14వ తేదీన హైకోర్టులో విచారణకు రానుంది. తీర్పు వచ్చే అవకాశమూ ఉంది. మరోవైపు కార్మిక చట్టాలు వర్తించవనే పేరుతో యాజమాన్యం ఇప్పటి వరకూ ఎన్నికల నిర్వహణను నిలిపేసింది. ఎవరైనా ధర్నాతో నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు లేబర్ కమిషనర్ చర్యతో సంస్థలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికారుల వ్యవహారం బయటకు వచ్చింది.







కామెంట్‌లు (0)