కార్గో హ్యాండ్లింగ్ మూలపేటకు తరలించడానికి కసరత్తు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రతిష్టాత్మకమైన విశాఖ పోర్టును అదాని కోసం బలిచేస్తున్నారా? తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు అదాని ఆధ్వర్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పోర్టుకు విశాఖ పోర్టులోని కార్గో హ్యాండ్లింగ్‌ను తరలించడానికి జోరుగా కసరత్తు సాగుతోంది. అదే జరిగితే విశాఖ పోర్టు ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం ఖాయం! ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి అదానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కన్నుసన్నలలో నడుస్తుండటంతో అదానికి భారీగా లబ్ధి కలిగించే ఈ ప్రతిపాదన శరవేగంగా ముందుకు కదులుతోంది. ఇంకా ప్రారంభం కూడా కాని మూలపేట అదాని పోర్టుకు లాభాలను గ్యారంటీ చేసి, విశాఖ పోర్టుకు నష్టం కలిగించే ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఉన్నత స్థాయి అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటంతో పోర్టు మేనేజ్‌మెంట్ పై కూడా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర పెట్టుబడులు మౌలికాభివృద్ధిశాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో విశాఖ పోర్టు నుండి మూలపేటకు కార్గో తరలింపుకోసం కసరత్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు. తనతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ ల నేతృత్వంలో ఏర్పడిన మంత్రుల కమిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కాలుష్యమే కారణమట!
కార్గో నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున విడుదలవుతున్న కాలుష్యాన్ని ఈ తరలింపునకు కారణంగా ప్రభుత్వం చెబుతుండటం విశేషం. విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్య రహిత పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, వాటిలో భాగంగానే ఈ తరలింపు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కార్గో కారణంగా బొగ్గుతో పాటు, ఇతర ఖనిజాల నుండే వచ్చే కాలుష్యం, దుమ్ము విశాఖను ముంచెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. తరలింపుతో విశాఖ నగరంలో వాయు కాలుష్యం తగ్గుతుందని, ప్రపంచస్థాయి ఐటి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. కోల్పోతున్న ఆదాయానికి ప్రత్యామ్నాయంగా మూలపేట పోర్టు స్పెషల్ పర్పస్ వెహికల్లో 49–50 శాతం ఈక్విటీ భాగస్వామ్యాన్ని కల్పించాలని విశాఖ పోర్ట్ అథారిటీ కోరిందని, నామినేషన్ విధానంలో తొలి దశలో రెండు బెర్త్‌లు, రెండో దశలో రెండు బెర్త్ లు కేటాయించాలని కూడా అడిగారని, వీటిని పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పరిశీలన ప్రకియ ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో మంత్రి ప్రకటనలో పేర్కొనలేదు. అదే సమయంలో మూలపేట పోర్టు ప్రారంభసమయానికి విశాఖ పోర్టు నుండి కార్గోను తరలిస్తామని మాత్రం స్పష్టంగా చెప్పడం గమనార్హం.







కామెంట్‌లు (0)