ఒడిశాలో నెల రోజుల ముందే ఓటర్ల సవరణ
ఎపిలో ఓటు కోల్పోయే ప్రమాదం
ప్రజాశక్తి- పార్వతీపురం : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న వివాదాస్పద కొటియా గ్రామాల ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కొంపముంచనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 21 కొటియా గ్రామాల ఓటర్లు అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇప్పటి వరకూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా చేపట్టిన ఎస్ఐఆర్ వల్ల మన రాష్ట్రానికి నష్టం పొంచి ఉంది. ఎపిలోని సాలూరు మండలం గంజాయిభద్ర, పట్టుచెన్నూరు, పగుల చెన్నూరు పంచాయతీల్లోని 21 కొటియా గ్రామాలు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రా మధ్య గత ఐదు దశాబ్దాలుగా ఈ గ్రామాల వివాదం నడుస్తోంది. ఈ గ్రామాల విషయంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేయడంతో పాటు రెండు ప్రభుత్వాలూ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఈ గ్రామాల ప్రజలు పొందుతున్నారు. కొటియా పంచాయతీకి సంబంధించి రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో సుమారు 1,900 మంది ఓటర్లు ఉన్నారు. పట్టుచెన్నూరు, పగుల చెన్నూరు పంచాయతీలకు కలిపి ఉన్న ఒక పోలింగ్ కేంద్రంలో సుమారు 1,100 ఓట్లు ఉన్నాయి. మొత్తం సుమారు మూడు వేల మంది ఓటర్లు రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేస్తూ వస్తున్నారు. ఎస్ఐఆర్ తర్వాత రానున్న ఏ ఎన్నికల్లోనైనా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదనేది తేటతెల్లమవుతోంది. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు కలిగి ఉండరాదనే నిబంధన కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో వివాదాస్పద కొటియా గ్రామాల ఓటర్లకున్న రెండు ఓట్లు ఛాన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒడిశాలో నెల రోజుల ముందే ఎస్ఐఆర్ పూర్తయింది. వివాదాస్పద కొటియా గ్రామాల గిరిజనులను ఒడిశా ప్రభుత్వం తమ ఓటర్లుగా నమోదు చేసుకుంది. ఇటు ఆంధ్రా, అటు ఒడిశాల్లో ఓటు హక్కు కలిగిన కొటియా గ్రామాల ఓటర్లు ఎస్ఐఆర్ నిబంధనలు తెలియక రెండుచోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ఎపిలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఒడిశా తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఎపిలో ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే సరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెండుచోట్ల ఓటు హక్కు కలిగిన వారికి ఏదో ఒక చోట ఓటు హక్కు పోతుందని ఎన్యూమరేషన్ అధికారులు చెబుతున్నారు. ముందుగా నమోదైన ఒడిశాలోనే కొటియా గ్రామాల ఓటర్లను చూపితే ఎపికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇదే జరిగితే ప్రజలు, ఓటర్లతోపాటు, అమూల్యమైన ఖనిజ సంపద ఉన్న కొటియా ప్రాంతం ఎపి నుంచి చేజారే ప్రమాదం ఉంది.
ఆంధ్రాలోనే ఉంటామంటున్న
కొటియా ప్రజల మాట చెల్లుతుందా?
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మెజారిటీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోనే కొనసాగుతామని గతంలో అనేకసార్లు స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలోనే ఉండాలని ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు దౌర్జన్యం చేసినా పట్టుచెన్నూరు, పగుల చెన్నూరు, గంజాయిబద్ర పంచాయతీల్లోని సుమారు 16 గ్రామాల ప్రజలు ఎపి వైపు మొగ్గు చూపుతున్నారు. ఐదు గ్రామాల ప్రజలు మాత్రమే ఒడిశా వైపు ఉంటామంటున్నారు. మెజార్జీ ప్రజలు కోరుతున్న విధంగా జరుగుతుందా? లేదా? అనేది వేచిచూడాలి. నష్టం జరగక ముందే ఎపి ప్రభుత్వం మేల్కొనాలి.








కామెంట్‌లు (0)