విద్యా వ్యవస్థలోని అక్రమాలకూ, నీట్ 2026 పేపర్ లీక్ కూ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఎ) ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) భారీ ధర్నా చేపట్టింది. దానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జులై 18 నాటికి ఆయన దీక్ష ఇరవై ఒక్క రోజులకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు దేశ వ్యాప్తంగా వెల్లువెత్తాయి. దేశంలోని ప్రముఖ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకు సంఘీభావం తెలియజేశాయి. వాంగ్ చుక్ ను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి, ఆయన ప్రాణాలు కాపాడాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వానికి ఆర్డరువేసింది. ఈ ఉత్తర్వును సాకుగా చూపి కదలలేని స్థితిలోవున్న వాంగ్ చుక్ దీక్షను భగ్నంచేస్తూ ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించింది మోడీ ప్రభుత్వం.
'లక్షల మంది యువతీయువకుల భవిష్యత్తు అంధకారమైపోతున్న తరుణంలో ఈ సమస్యలోని తీవ్రతను ప్రభుత్వానికి తెలియజెప్పడానికే తను ఈ నిరాహార దీక్ష చేస్తున్నానని, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, ప్రభుత్వానికి సహాయపడేదే '' నని సోనమ్ వాంగ్ చుక్ దీక్షాస్థలిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పేపర్ లీక్ లతో భవిష్యత్తు కోల్పోయిన యువతీయువకుల బాధతో, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల బాధతో, వారి తల్లిదండ్రుల బాధతో పోలిస్తే తన బాధ చాలా చిన్నదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సాగదీయకుండా సానుకూలంగా వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
కానీ, కేంద్ర ప్రభుత్వపు మొండి వైఖరి ఈ దేశ ప్రజలకు తెలుసు. గతంలో ఢిల్లీ సరిహద్దులో వందల మంది రైతులు ప్రాణాలర్పించినా ఈ ప్రభుత్వం చలించలేదు. వారి ప్రాణత్యాగాలకు విలువ ఇవ్వలేదు. రైతుల న్యాయమైన కోర్కెలను పట్టించుకోలేదు. తమ మూర్ఖత్వాన్ని అలాగే కొనసాగిస్తూ రైతు చట్టాలు మాత్రం వెనక్కి తీసుకున్నారు. అందువల్ల, ఇప్పుడు వాంగ్ చుక్ నిరాహార దీక్ష గురించి గానీ, లక్షల మంది యువతీయువకుల భవిష్యత్తు గురించి గానీ ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా అన్నది అనుమానమే!
సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఒక ఇంజనీర్, విద్యావేత్త, సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త. జమ్మూకాశ్మీర్ కు చెందిన వాంగ్ చుక్ లడక్ ప్రాంతంలో పలు విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ‘స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడక్' అనే సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. మంచు స్థూపం (ఐస్ స్థూప) సాంకేతికతను అభివృద్ధి చేసి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 2018 లో 'రామన్ మెగసెసే' పురస్కారం లభించినప్పుడు ఆయన పేరు బాగా వెలుగులోకి వచ్చింది.
ఈయన కృషిలో మంచు స్థూపం చెప్పుకోదగ్గది. లడక్ ప్రాంతంలో వృథాగా పోయే శీతాకాలపు నీటిని అంటుకట్టి శంఖాకారపు మంచు కుప్పల రూపంలో నిలువ చేస్తారు. వేసవిలో నీటి కొరత ఉన్నప్పుడు, పంటలకు నీరు కావాల్సినప్పుడు ఈ మంచును కరిగించి ఉపయోగిస్తారు. నీటి పారుదల కోసం కాలువలు తవ్వడం, గడ్డ కట్టించడం ఆ ప్రాంతంలో వందల సంత్సరాలుగా ఉన్నదే. కానీ, వాంగ్ చుక్ మళ్ళీ ఆ పద్ధతిని పునరుద్ధరించి, ఆధునీకరించి, అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ప్రాజెక్ట్ ను తన ఎన్.జి.ఒ సంస్థ ద్వారా నిర్వహించారు. ఇవి అక్కడి వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చాయి. ఈ పనితో వాంగ్ చుక్ రైతు బాంధవుడిగా, పర్యావరణవేత్తగా వెలుగులోకి వచ్చారు.
జమ్మూకాశ్మీర్ లో జన్మించిన వాంగ్ చుక్ శ్రీనగర్ లో చదువుకున్నారు. అక్కడి ఎన్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. తరువాత ఫ్రాన్స్ లోని క్రేటర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మట్టి నిర్మాణ శిల్పకళపై ఉన్నత విద్యనభ్యసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విఫలమైన విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యావకాశాలు కల్పించడానికి తర్వాత కాలంలో ఆయన స్థాపించిన సంస్థ ఎంతగానో ఉపయోగపడింది. దానితో ఆయన కొన్ని సంస్కరణలు కూడా తీసుకురాగలిగారు. అలాగే ‘ఆపరేషన్ న్యూ హోప్’ (1994) అనే కార్యక్రమం ద్వారా లడక్ విద్యావ్యవస్థలో మరికొన్ని సంస్కరణలు తేగలిగారు. 1993 – 2005 మధ్య కాలంలో వాంగ్ చుక్ 'లడగ్స్ మెలాంగ్'(లడఖ్ అద్దం) అనే పత్రికను తన స్వీయ సంపాదకత్వంలో నిర్వహించారు. ఇది లడక్ ప్రాంతంలో అచ్చయి వెలువడిన తొలి, ఏకైక పత్రిక.
సోనమ్ వాంగ్ చుక్ గతంలో కూడా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ రక్షణ, లడక్ ప్రాంత ప్రజల హక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 2024 లో లడక్ కు ప్రత్యేక హోదాకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ప్రారంభమైన 'క్లైమేట్ ఫాస్ట్' ఉద్యమం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో భాగంగా 2025 సెప్టెంబర్ 24 న లెహ్ లో జరిగిన ఒక విధ్వంసానికి వాంగ్ చుక్ ని బాధ్యుడిని చేస్తూ పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద (ఎన్.ఎస్.ఎ) అరెస్ట్ చేసి, జోద్ పూర్ జైల్లో 170 రోజుల పాటు నిర్బంధించారు. 2026 మార్చి 14 న విడుదలై బయటికి వచ్చారు. అందువల్ల, ఉద్యమాలు, జైలు జీవితం వాంగ్ చుక్ కు కొత్త కాదు.
ప్రస్తుతం (జూన్ - జులై 2026) ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష సమయంలో సోనమ్ వాంగ్ చుక్ తనను తాను గౌరవ కాక్రోచ్ గా పేర్కొంటూ తను నిరుద్యోగిని కానీ, సోమరిపోతును గానీ కాకపోయినా యువత ఆవేదనకు తన సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు.
ఈ దేశంలో మేధావుల్ని వేధించడం, వారి ప్రాణాలు తీయడం ఈ ఆర్.ఎస్.ఎస్, బిజెపి ప్రభుత్వానికి కొత్త కాదు. అందువల్ల, ప్రజలే పూనుకుని సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి! కరుడు గట్టిన ప్రభుత్వ పెద్దల మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టడానికి నడుం బిగించాలి.

వ్యాసకర్త : ప్రొ. దేవరాజు మహారాజు
నేషనల్ బుక్ ట్రస్ట్ ’ పూర్వ సలహా సంఘ సభ్యుడు, జీవశాస్త్రవేత్త.








కామెంట్‌లు (0)