బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచీకట్లోనే దళితవాడల బతుకులు

1 గంట క్రితం

dalits
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

చీకటి పడితే చాలు, మన రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా ఊరి చివర వెలిగే ఆ చిమ్నీల వెలుగుల వెనుక దాగి వున్న కన్నీటి గాథలు ఎవరికీ వినిపించవు. ఆ ఊరి పేరు ఏదైనా, ప్రాంతం ఏదైనా దళితవాడల పరిస్థితి మాత్రం ఒక్కటే. అది అణచివేతకు నిలువుటద్దం. రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటింది. ప్రభుత్వాలు మారాయి, ఎన్నో పథకాలు వచ్చాయి. కానీ, దళితవాడల్లోని సామాజిక స్థితిగతుల్లో వచ్చిన మార్పు ఎంత? అక్షరాస్యత రేటు 77 శాతానికి పెరిగిందని రాష్ట్ర ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి. కానీ, ఈ గణాంకాల వెనుక ఉన్న చేదు నిజాలను మనం పల్లెల్లోకి వెళ్లి చూస్తే కన్నీళ్లు ఆగవు. మన రాష్ట్రంలో సాధారణ వర్గాల అక్షరాస్యతతో పోలిస్తే, దళిత వర్గాల అక్షరాస్యత 10 శాతం నుంచి 12 శాతం తక్కువగా ఉంది. ఆ 12 శాతం అక్షరాల అగాధమే, కోట్లాది మంది దళిత బిడ్డల భవిష్యత్తును నిర్ణయించే గీత. చదువుకోవాలనే ఆశ ప్రతి దళిత గుండెలోనూ రగులుతోంది, కానీ ఆ ఆశను ఆవిరి చేసే పరిస్థితులు మన ప్రభుత్వ బడుల్లో కనిపిస్తున్నాయి.

మన రాష్ట్రంలోని పాఠశాలల నుంచి బడి మానేసే పిల్లల విషయాన్ని ఒకసారి ఆరా తీయండి. రాష్ట్రవ్యాప్తంగా దళిత వర్గాల విద్యార్థుల్లో మాధ్యమిక విద్య పూర్తికాకముందే సుమారు 45 శాతం మంది బడి వదిలేస్తున్నారు. అంటే, దాదాపు సగం మంది విద్యార్థులు తమ కలలను, పుస్తకాలను మధ్యలోనే వదిలేసి, కడుపు నింపుకోవడం కోసం పనులకు వెళ్తున్నారు. అగ్రవర్ణాల్లోని విద్యార్థులతో పోలిస్తే, ఈ డ్రాప్ అవుట్ రేటు మన రాష్ట్రంలో దళితుల్లో 20 శాతం ఎక్కువగా ఉండటమనేది ఎంతటి విషాదం? చదువుకోవాల్సిన వయసులో బడి మానేసి, తల్లిదండ్రులకు ఆసరాగా ఇటుక బట్టీల్లోనో, పొలాల్లోనో పనికి వెళ్తున్న ఆ పదిహేనేళ్ల బాలబాలికల సంఖ్య 30 శాతమని తెలిస్తే గుండె తరుక్కుపోతుంది.

భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం. మన రాష్ట్రంలోని వ్యవసాయ ఆధారిత భూములలో, దళితులకు స్వంతంగా ఉన్న భూమి 5 శాతం లోపే. మిగిలిన భూమి అంతా అగ్రవర్ణాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అంటే, సుమారు 40 శాతం దళిత కుటుంబాలు భూమి లేని వ్యవసాయ కూలీలుగానే బతుకుతున్నాయి. అదే ఇతర వర్గాల విషయానికి వస్తే, వారికి అధిక శాతం భూమి ఆధీనంలో ఉంది. భూమి లేని ఆ దళిత కుటుంబాలు, ప్రతి రోజూ ఆకలితోనే నిద్రపోతున్నాయి. భూ సంస్కరణలు వచ్చాయి, కానీ అవి కేవలం కాగితాల మీదనే మిగిలాయి. దళితులకు పంచాల్సిన అసైన్డ్ భూమి ఎవరి చేతుల్లో ఉందో, ఎందుకు పంచలేదో అడిగే నాథుడే లేడు.

చదువుకున్న వారి పరిస్థితి మరీ దారుణం. కష్టపడి డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన దళిత నిరుద్యోగుల శాతం మన రాష్ట్రంలో 25 శాతంగా ఉంది. అదే సాధారణ వర్గాల నిరుద్యోగిత 12 శాతంగా ఉంటే, దళితులలో ఇది రెట్టింపుగా ఉంది. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థల బోర్డు గదుల్లో దళితుల ప్రాతినిథ్యం 1 శాతం కూడా లేదు. మేధస్సు ఉండి కూడా, కేవలం సామాజిక నేపథ్యం కారణంగా ఉద్యోగం రాని దళిత యువత, ఆత్మన్యూనతా భావంతో, డిప్రెషన్ లోకి వెళ్తున్న వారి సంఖ్య 30 శాతం దాటుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ దళితుల ఓటింగ్ శాతం 80 శాతం దాటుతోంది. కానీ, నిర్ణయాధికారం దళితులకు ఎంత ఉంది? గ్రామ పంచాయతీల్లో, మండల స్థాయిలో దళిత నాయకులు గెలుస్తున్నారు, కానీ నిర్ణయాలు తీసుకునే అధికారంలో వారిది కేవలం 10 శాతం లోపే. దళితుడు కేవలం ఓటరు మాత్రమే, నిర్ణేత కాదు. మరణానంతరం కూడా కులం వివక్షను వదలడం లేదు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా ప్రాణం విడిస్తే, ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి దళితులకు ఒక గౌరవప్రదమైన స్థలం లేక, పొలాల గట్ల మీద, కాల్వల ఒడ్డున అంత్యక్రియలు చేయాల్సి రావడం ప్రజాస్వామ్యానికే అవమానం. జీవో నెంబర్ 1235 పేరుతో శ్మశానవాటికల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో అగ్రవర్ణాల అడ్డుపుల్లలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ స్థలాలు దళితవాడలకు దక్కడం లేదు.

మతం మారినంత మాత్రాన వివక్ష పోదన్నది దళిత క్రైస్తవుల జీవితాల్లోకి చూస్తే అర్థమవుతుంది. దేవుని ముందు అందరూ సమానమే అని బోధించే గ్రంథాలు, కుల వ్యవస్థను మాత్రం అంతం చేయలేకపోయాయి. దళిత క్రైస్తవుల పోరాటం కేవలం ఆర్థికమైనది కాదు, అది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న. మహిళా సాధికారత కోసం తెచ్చిన డ్వాక్రా పథకం, దళిత మహిళల జీవితాల్లో అప్పుల భారాన్ని పెంచింది. 60 శాతం దళిత కుటుంబాలు ఈ డ్వాక్రా అప్పుల వడ్డీల కోసం తమ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన పథకాలు, వారిని అప్పుల కుప్పల్లోకి నెట్టేయడం శోచనీయం. నిధుల విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 60 శాతం పక్కదారి పడుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల అభివృద్ధికి రావాల్సిన నిధులు, ఇతర సాధారణ అభివృద్ధి పనులకు మళ్లించబడుతున్నాయి. ఈ నిధుల వినియోగంపై ప్రతి గ్రామంలో సామాజిక తనిఖీ జరగాలి, కానీ అది జరగనివ్వడం లేదు.

దళితవాడల్లోని మౌలిక వసతుల లోపం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 70 శాతం దళితవాడల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం లేదు. దీనివల్ల సీజనల్ వ్యాధులు వచ్చి దళిత కుటుంబాలు తమకున్న కొద్దిపాటి సంపాదనను మందులకే ఖర్చు చేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే 'క్లీన్ విలేజ్' పథకాలు అగ్ర వర్ణాల కాలనీలకే పరిమితం కావడానికి కారణం ఏమిటి?

దళితులపై దాడులు జరిగినప్పుడు, పోలీసులు కేసులు నమోదు చేయడంలో చూపే ఉదాసీనతను చూస్తే చట్టం ఎవరి కోసం పని చేస్తోందనే అనుమానం కలుగుతుంది. అట్రాసిటీ చట్టం ఉన్నా, అది కేవలం ఆరోపణలు విచారించే స్థాయిలో ఉందే తప్ప, నేరాలను అరికట్టే స్థాయిలో లేదు. బాధితులకు సత్వర న్యాయం అందడం లేదు. దళిత మహిళలపై జరుగుతున్న దాడులైతే వర్ణనాతీతం.

దళితులు కేవలం ఓటు బ్యాంకులు కాదు, ఈ రాష్ట్ర నిర్మాతలు. వారి కన్నీటిని తుడిచి, అభివృద్ధిలో భాగస్వాములను చేసినప్పుడే మన రాష్ట్రం నిజంగా వృద్ధి చెందినట్టు. సమాజ ఆలోచనా దృక్పథం మారనంత వరకు, చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఫలితం ఉండదు. ఆ వెలుగు కోసం, ఆ సమానత్వం కోసం, ప్రతి దళిత గుండెలోనూ ఒక ఆశ ఉంది. ఆ ఆశ, ఆ ఆకాంక్షతో కలిసి అడుగులు వేద్దాం.

kiran sfi

వ్యాసకర్త : ఎం. కిరణ్
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు,

సెల్‌: 9705747318


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్