శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ ఉక్కుకు సొంత గనులు

1 గంట క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆంధ్రా మేధావుల ఫోరం వ్యవస్థాపకులు చలసాని శ్రీనివాస్ డిమాండ్‌

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు రక్షణకు సొంత గనులు కేటాయించేలా చూడాలని, ప్లాంట్‌‌ను సెయిల్‌‌లో విలీనం చేయాలని ఆంధ్రా మేధావుల ఫోరం వ్యవస్థాపకులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ ఉక్కు కర్మాగార భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి’ అనే అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి అంటే కేంద్రానికి గల చులకన భావంతోనే నేటికీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని విమర్శించారు. సొంత గనులు లేకపోవడంతో ఒక టన్ను ఇనుము తయారీకి రూ.6,400 ను అదనంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఖర్చు చేస్తోందని వివరించారు. ఈ భారం తగ్గించడం కోసం సొంత గనులు కలిగిన సెయిల్‌‌లో విలీనం చేయడానికి అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు నిర్వాసితులైన వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించి వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేసి, వారి ఉపాధిని, భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని విమర్శించారు. కర్మాగారంలో పని భారాన్ని పెంచి, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి కార్మికులు తమంతట తామే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అంగీకరించేలా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌‌కు సొంత గనులు లేవని మాట్లాడారని, అందుకే నష్టాలు వస్తున్నాయని చెప్పారని, ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోనే ఉన్నా ఎందుకు సొంత గనులు రప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటం కారణంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌‌ను సక్రమంగా నడిపించేందుకు, సొంత గనులు తెప్పించేందుకు పోరాడాలని డిమాండ్‌ ‌చేశారు. పోరాట కమిటీ మరో చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌‌కు రూ.11400 కోట్లను కేంద్రం కేటాయించిందని, ఆ డబ్బును ఢిల్లీ పెద్దల ఆదేశాలతో బ్యాంకులకు కట్టారని విమర్శించారు. ఉక్కు భూముల అమ్మకానికి కుట్ర జరుగుతోందన్నారు. సమావేశంలో నాయకులు వరసాల శ్రీనివాసరావు, నాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్