- డేటా సెంటర్లతో పొంచివున్న తాగునీటి ముప్పు
- పెరుగుతున్న కాలుష్యంతో తీవ్ర అనారోగ్య సమస్యలు
- ‘ఉక్కు’పై కొనసాగుతున్న కుట్రలు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ నగరాన్ని ప్రజా సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఒకవైపు అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తున్న ఈ నగరంలో మురికివాడలు, పేదలు నివసించే వార్డులు అత్యధికంగానే ఉన్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ సమస్యలు అజెండాలోకి వస్తున్నా.. గెలుపు అనంతరం అవి విస్మరించబడుతున్నాయి. ప్రస్తుతం జివిఎంసి పరిధిలోని 120 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో చాలా ప్రాంతాల్లో తాగునీటి కొరత వెంటాడుతోంది. ఆరిలోవ, మధురవాడ, ఎండాడ, సాగర్‌నగర్, మద్దిలపాలెం, రుషికొండ, గాజువాక ప్రాంతాలు ఇటీవల కాలంలో రోజుల తరబడి తాగునీటికి నోచుకోకపోవడం లేదు. దీనికి తోడు తాగునీటి వనరులను దెబ్బతీసేలా.. ముడసర్లోవ దరి సింహాద్రి అప్పన్న కొండకు ఆనుకుని 160 ఎకరాలను అదాని డేటా సెంటర్ కోసం చంద్రబాబు ప్రభుత్వం కేటాయించడంతో ఈ కొండంతా తవ్వకాలు సాగుతున్నాయి. ఈ ప్రభావం పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్‌పై పడి జనం తాగునీటి ఇక్కట్లు పెరగనున్నాయని మేధావులు, పౌర సమాజం గగ్గోలు పెడుతున్నా పనులు ఆగడం లేదు. నగరంలోని తీర ప్రాంతంలో మల్టీస్టోరీడ్ భవనాలు పెరిగిపోతుండడంతో భూగర్భ జలాల్లోకి తీర ప్రాంతం అంతటా ఉప్పు నీరు ప్రవేశించినట్లు భూగర్భ శాఖ, జివిఎంసి అధికారుల నివేదికలున్నాయి. అయినా రియల్ ఎస్టేట్, కార్పొరేట్ హోటల్ యాజమాన్యాలను నిరోధించలేని స్థితిలో ప్రభుత్వం పడింది. నీటి కొరత తీవ్రమవుతున్నా ముడసర్లోవ సమీప కొండలపై 0.5 గిగావాట్ల సామర్థ్యంగల డేటా సెంటర్, మొత్తంగా విశాఖ చుట్టూ 7.9 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. పెరుగుతున్న జనాభాకు నీటి వనరుల లభ్యతను నగరం కోల్పోయే పరిస్థితులు ఇప్పటికే దాపురించాయి. ఈ పరిస్థితులు నగర వాసులను కలవరానికి గురిచేస్తున్నాయి. మరోపక్క పర్యావరణ విధ్వంసం కూడా సాగుతోంది. జలవనరులపై డేటా సెంటర్ ప్రాజెక్టుల ఒత్తిడి నగర వాసులకు పెద్ద సవాల్‌గా మారింది.
కాలుష్య ముప్పు
విశాఖ పోర్టు, పెరిగిన ట్రాఫిక్‌తో ఇప్పటికే కాలుష్యం విషయంలో పెద్ద ఎత్తున ప్రమాదకర ఉద్గారాలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ కాలుష్యాన్ని కూడా విశాఖ దాటేసింది. గాలి నాణ్యత పూర్తిగా క్షీణిస్తోందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామిక వ్యర్థాలు (ఫ్లై యాష్) స్థానిక ప్రజల శ్వాస కోశ సమస్యలను పెంచుతున్నా ప్రజల ఆరోగ్యం గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. నగర జనాభా విస్తరణకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. విశాఖ విమానాశ్రయాన్ని మూసేసి భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించడంతో ఈ ట్రాఫిక్ నగరంపై మరింత పెరిగింది. మెట్రో రైలు, డబుల్ డెక్కర్ రైలు అంటూ పాలకులు ఊరిస్తూనే ఉన్నా ఆచరణ రూపం దాల్చడం లేదు. ఇంకా పరిష్కారం కాని డైయినేజీల సమస్యలు, మురికివాడల్లో మౌలిక వసతుల లేమి నగరంలోని పది లక్షల మంది ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌పై ప్రైవేటీకరణ కుట్రలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. గతేడాది ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులను ప్లాంట్‌లో తొలగించారు. పై సమస్యలపై టిడిపి, వైసిపి గత కార్పొరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. సిపిఎం మాత్రమే పాలకవర్గ సమావేశాల్లో సమస్యలను పలుమార్లు లేవనెత్తింది. పరిష్కారానికి ప్రయత్నించింది.






కామెంట్లు (0)