సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భావి కళాకారులను తయారు చేయాలి

58 నిమిషాల క్రితం

rambhupal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 10:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలో 'ప్రజాశక్తి` డిప్యూటీ ఎడిటర్ రాంభూపాల్

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి/కార్పొరేషన్ : ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా భావి తరాల కళాకారులను తయారు చేయాలని 'ప్రజాశక్తి` డిప్యూటీ ఎడిటర్ వి.రాంభూపాల్ అన్నారు. కర్నూలులోని సన్యాసిరావు, పెంచలయ్య నగర్ లో మూడు రోజులపాటు జరిగిన ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభలో సోమవారం ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ప్రజా గొంతుకలను భయపెట్టడం ద్వారా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం బిజెపి చేసిందని, మొట్టమొదటిసారి యువత ఒత్తిడితో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని, భయపెట్టే వారే ఉద్యమానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఎంతటి నియంతృత్వ ప్రభుత్వనైనా ప్రజా ఉద్యమాలు ఓడించగలరని జెన్ జీ ఉద్యమం నిరూపించిందన్నారు. ఢిల్లీ ఆందోళన, సంఘీభావ కార్యక్రమాల్లో కొత్త గొంతుకలు, కళారూపాలు ముందుకు వచ్చాయన్నారు. ప్రజల్లోని పోరాట భావాన్ని ఒక వేదికపైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టి, చీల్చి గద్దెనెక్కాలని చూడటం ఎల్లకాలం సాగదని, కుట్రలను ఎంతో కాలం భరించరనే సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రించడం, ప్రతిపక్షాలను లోబర్చుకోవడం ద్వారా 12 ఏళ్లుగాబిజెపి పరిపాలిస్తూ వస్తోందని, ఈ ప్రయత్నాలు క్రమంగా బలహీన పడిపోతున్నాయని తెలిపారు. ఢిల్లీ ఉద్యమంపై పొరుగు రాష్ట్రాల్లో సంఘీభావ సభలు నిర్వహిస్తే, మన రాష్ట్రంలోని అధికార పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మౌనం వహించడం శోచనీయమన్నారు. ప్రజాతంత్ర ఆలోచనతో ఉన్న శక్తులను కళల ద్వారా ఐక్యం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

​సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి : తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ కార్యదర్శి డివి రాజు

మారుతున్న సామాజిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావానికి అనుగుణంగా ప్రతి కళాకారుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డివి.రాజు అన్నారు. మహాసభలో ఆయన సౌహార్థ్ర సందేశం ఇచ్చారు. మొబైల్ ఫోన్ ద్వారానే షూటింగ్, ఎడిటింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకుని, తమ ప్రతిభను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందన్నారు. ప్రజానాట్యమండలి ప్రజల కోసం, సమాజ ప్రగతి కోసం పనిచేస్తున్న గొప్ప సాంస్కృతిక ఉద్యమ సంస్థ అని కొనియాడారు.

ప్రజల గొంతును ప్రతిధ్వనింపజేసేవాడే సుకవి : అష్టావధాని డాక్టర్ బోరెల్లి హర్ష

ప్రజల గొంతును ప్రతిధ్వనింపజేసేవాడే నిజమైన సుకవి అని అష్టావధాని, సంస్కృత–ఆంగ్ల పండితులు డాక్టర్ బోరెల్లి హర్ష అన్నారు. ప్రజల హృదయాలను కదిలించి వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తే నిజమైన కళాకారుడని పేర్కొన్నారు. కళాకారులు ప్రజల జీవితాలతో మమేకమై సమాజానికి ఉపయోగపడే సృజన చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను, ఆశయాలను ప్రతిబింబించే కళా సృష్టే చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్