- మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్‌బాబు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మెగా డిఎస్ సి పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రీడా కోటా ఉద్యోగాలను తన అనుచరులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచారని వైపిపి ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్‌బాబు విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్ సి నిర్వహణ సందర్భంగా ఎపి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అంతులేని అరాచకాలు చేసిందని వెల్లడించారు. మెరిట్ జాబితా విడుదల కాకముందే, అభ్యర్థుల అటెస్టేషన్ చేశారని తెలిపారు. అంతకు ముందు అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ తేదీకి ముందే సర్టిఫికెట్లపై కూన రవికుమార్ సంతకాలు చేశారని పేర్కొన్నారు. సాధారణ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే అసోసియేషన్ సభ్యుల కుటుంబీకులు ఫ్యామిలీ కోటా కింద పోస్టులు కొట్టేశారని మండిపడ్డారు. వయసుతో సంబంధం లేకుండా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అర్హులైన నిరుద్యోగుల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ నిలదీయడానికి ఈనెల 21న ‘శాప్’ కార్యాలయానికి వెళతామని, మంత్రి నారా లోకేష్‌కు దమ్ముంటే అక్కడ చర్చకు రావాలని సుధాకర్ బాబు కోరారు.







కామెంట్‌లు (0)