గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోం

1 గంట క్రితం

పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోం
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 
- కన్నాయిగూడెంలో ప్రారంభమైన బైకు యాత్ర 
- తొలి రోజు 60 కిలోమీటర్లు - ఎక్కడికక్కడ ఘన స్వాగతం 
- సమస్యలపై వినతులు అందజేసిన ప్రజలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:44 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

  • కన్నాయిగూడెంలో ప్రారంభమైన బైకు యాత్ర

  • తొలి రోజు 60 కిలోమీటర్లు - ఎక్కడికక్కడ ఘన స్వాగతం

  • సమస్యలపై వినతులు అందజేసిన ప్రజలు

ప్రజాశక్తి - ఎటపాక (పోలవరం జిల్లా) : పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును ప్రారంభిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యాన ఐదు రోజులపాటు తలపెట్టిన బైకు యాత్రను గురువారం పోలవరం జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. తొలుత పార్టీ నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి సరికాదన్నారు. వారికి న్యాయం చేసిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభిం చాలని డిమాండ్‌ ‌చేశారు.

ముంపు గ్రామాలను అసమగ్రంగా, అస్తవ్యస్తంగా ప్రభుత్వం గుర్తించిందని, తమ పార్టీ ఆధ్వర్యాన ‘పోలవరం నిర్వాసితుల పోరుకేక’ మహా పాదయాత్ర అనంతరం 16 గ్రామాలను ముంపు గ్రామాలుగా నోటిఫై చేయడం జరిగిందన్నారు. 45 కాంటూరు ముంపు జాబితాలో ఉన్న గ్రామాలు కూడా చిన్నపాటి వరదకే నేడు ముంపునకు గురవుతున్నాయని, 41, 45 కాంటూర్‌ లెవల్ కాకుండా వరద ముంపు‌నకు గురయ్యే గ్రామాలన్నింటికీ ఒకే దఫా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. 2006 కట్ ఆఫ్ డేట్‌‌గా ప్రకటించి పరిహారం ఇస్తామంటే కుదరదని, గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరినీ కుటుంబంగా గుర్తించి ఆడ, మగ తేడా లేకుండా అందరికీ పరిహారం ఇవ్వాలని కోరారు. సారవంతమైన భూములు తీసుకొని రాళ్లతో నిండిన భూములు అప్పగించారని విమర్శించారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన పునరావాస కాలనీలో నేటికీ సౌకర్యాలు పూర్తికాకపోవడం నిర్వాసితుల పట్ల ప్రభుత్వ అలసత్వాన్ని గుర్తుచేస్తుందన్నారు. వన్ టైం సెటిల్‌‌మెంట్‌ అంటూ ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుందని, నిర్వాసితులెవ్వరూ మోసపోవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులందరినీ చైతన్యం చేసి, ఐక్య పరిచి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామన్నారు. జిఒ నంబర్ 3పై చంద్రబాబు ఇచ్చిన హామీని డిసెంబర్‌‌లోగా నిలబెట్టుకోవాలని, తర్వాత గిరిజన యువతతో పెద్ద ఉద్యమం చేపడతామని తెలిపారు. 1/70 చట్టాన్ని పరిరక్షించాల్సింది పోయి.. తీసేయాలంటూ కొందరు అధికార నేతలు మాట్లాడడం దారుణమన్నారు. ఓట్లేసి గెలిపించి ప్రజాప్రతినిధులను చేస్తే ఇదేనా ప్రజలకు మీరిచ్చే బహుమతి అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు, గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టే వరకూ సిపిఎం నిరంతరం ప్రజలతోనే ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ... ప్రశ్నిస్తూ పోరాడితేనే ప్రభుత్వాలు పనిచేస్తాయని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొల్పాలని, కానీ ఉన్న పరిస్థితుల కంటే దుర్భర పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు నిర్వాసితులను నెట్టివేస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితుల తరఫున సిపిఎం తప్ప మరే పార్టీ పనిచేయడం లేదన్నారు. బైకు యాత్ర ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

​బైకు యాత్ర సాగిందిలా..

కన్నాయిగూడెంలో ప్రారంభమైన బైకు యాత్ర చింతలగూడెం, ఎటపాక, గుండాల కాలనీ, గోళ్ళగట్ట, పాండురంగాపురం, నెల్లిపాక, లక్ష్మీపురం, గన్నవరం, నల్లకుంట మీదుగా విస్సాపురం చేరుకుంది. తొలి రోజు సుమారు 60 కిలోమీటర్లు సాగగా అన్ని చోట్లా ప్రజలు ఈ యాత్రకు అపూర్వ స్వాగతం పలికారు. వారి సమస్యలను తెలియజేస్తూ వి.శ్రీనివాసరావు నేతృత్వాన గల యాత్రా బృందానికి వినతులు అందించారు. పరిహారం, పునరావాసం, స్థానిక సమస్యలను వినతి పత్రాల్లో పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజులు, లోతా రామారావు, పల్లపు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు ఇసంపల్లి వెంకటేశ్వర్లు, పాయం సీతారామయ్య, పులి సంతోష్ కుమార్‌, విఆర్.పురం మాజీ ఎంపిపి కారం లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు ఎంబి.నర్సారెడ్డి, కారం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

​తెలంగాణ నేతల సంఘీభావం

ఈ యాత్రకు రాజుపేట వద్ద సిపిఎం తెలంగాణ నేతలు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. మోటార్ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నాయకులు బండారు శరత్, సున్నం గంగ, వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్