బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులను మోసగిస్తే ఊరుకోం

57 నిమిషాల క్రితం

solat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- టాటా పవర్ సోలార్ యాజమాన్యం, దళారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

- సోలార్‌ ‌బాధిత రైతుల పోరాట కమిటీ రాష్ర్ట కన్వీనర్‌ ‌హరి డిమాండ్‌

​ప్రజాశక్తి - అనంతపురం : సోలార్ కోసం భూములు ఇచ్చిన రైతులను మోసం చేస్తున్న టాటా పవర్ సోలార్ కంపెనీ, దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రైతులతో కంపెనీ నిర్వాహకులు చర్చలు జరిపి న్యాయం చేయాలని సోలార్‌ ‌బాధిత రైతుల పోరాట కమిటీ రాష్ర్ట కన్వీనర్‌ ఏ. హరి డిమాండ్‌ ‌చేశారు. సోలార్‌ ‌భూములను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ...13 నెలల కిందట కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలో హోసూరు, జోహాపురం, పెద్ద హుల్తీ, కురుబలకొట్టాల గ్రామాలలో (సుమారు 1800 ఎకరాలలో) గ్రామ సభలు నిర్వహించకుండా, 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా దళారుల ద్వారా రైతులతో అగ్రిమెంట్ చేసుకుని టాటా పవర్‌ సోలార్ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. సోలార్ ప్రాజెక్ట్ కంపెనీల నిబంధనలను రైతులకు స్పష్టంగా చెప్పకుండా, దళారులతో చేయించుకున్న అగ్రిమెంట్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే గ్రామసభలు నిర్వహించి, '2013 భూసేకరణ చట్టం' ప్రకారం చర్యలు చేపట్టాలని, లీజు కాలంలో సోలార్ కంపెనీలు రైతుల భూములను బ్యాంకులలో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోకుండా కఠినమైన షరతులు విధించాలని కోరారు. లీజు కాలపరిమితి ఐదు సంవత్సరాలకు మించకూడదని, రైతుల భూములకు సోలార్ కంపెనీల నుండి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే నంద్యాల, కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని సెయిల్ సోలార్ కంపెనీ మూడేళ్ల కిందట రైతులను మోసం చేసి భూములు తీసుకుందని, ప్లాంట్ ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నా.. అగ్రిమెంట్ ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని, బాధితులు అడిగినా, ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినా మాట మారుస్తూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా సోలార్ విద్యుత్ కోసం జరుగుతున్న భూసేకరణలో రైతులకు మోసం, అన్యాయం జరుగుతోందని, ఇప్పటికైనా టిడిపి కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల పక్షాన నిలబడి వెంటనే గ్రామ సభలు జరిపి, 2013 భూసేకరణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సోలార్ బాధిత రైతులను ఐక్యం చేసి ఉధృత పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్