ఇన్వెస్ట్ మెంట్ డెస్క్ ఏర్పాటుకు చొరవచూపండి
సంయుక్త శిక్షణా అకాడమీల ఏర్పాటుకు సిద్ధం
ఆ దేశ విదేశాంగశాఖ ఉపమంత్రితో లోకేష్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపి అమలు చేస్తున్న త్రిఎస్(స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. దక్షిణకొరియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తో లోకేష్ సియోల్‌లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారత్‌లో ఎపిని అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చేసుకునేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. తాము అందించే పన్ను రాయితీలు, తక్కువధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమల యజమానులకు మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పుతీరంలో సురక్షితమైన, నమ్మకమైన, స్నేహపూర్వక ప్రత్యామ్నాయంగా ఎపి నిలుస్తుందన్నారు.
భారీ పరిశ్రమలేకాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడరన్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొరియన్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఫ్యాక్టరీల ప్రారంభానికి ముందే కొరియన్ వర్క్ స్టాండర్ట్స్, లాంగ్వేజ్, కల్చర్ పై స్థానిక యువతను సిద్ధం చేసేందుకు దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలను ఏర్పాటుచేసేందుకు ఎపి విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నం – బుసాన్/ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎపిలోని యూనివర్సిటీల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్లు, డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీకి చొరవ చూపాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఎపిని నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు సహకరించండి: ఉపమంత్రి కామ్చాన్ కాంగ్‌తో లోకేష్ భేటీ
ఎపిని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు దక్షిణ కొరియా సహకారం అందించాలని దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్‌తో జరిగిన భేటీలో మంత్రి లోకేష్ కోరారు. ఎపి యువతను భవిష్యత్తుకు సిద్ధమయ్యే డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా తయారుచేయడానికి కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలన్నారు. మౌలిక సదుపాయాల నిర్మాణంలో కొరియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కియా కార్యకలాపాలను మరింత విస్తరించాలని కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్ లీ,ఇతర ఉన్నతస్థాయి బృందాన్ని కోరారు. ఎపిలో డిస్ ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్ సిఇవో ఎస్‌డబ్ల్యూచుంగ్‌తో జరిగిన సమావేశంలో కోరారు.








కామెంట్‌లు (0)