ప్రజాశక్తి-అమరావతి: స్థానిక ఎన్నికలు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తాయని, అందుకే వాటికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓటు షేర్‌తో విజయం సాధించామని తెలిపారు. గత ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ అనేక సవాళ్ల మధ్య కూడా హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. వ్యక్తులకు భద్రత, కుటుంబాలకు సాధికారత కల్పించడంతోపాటు గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని, ఇది భారీ ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమమని పేర్కొన్నారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం కల్పించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0 వంటి పథకాలతోపాటు వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు డేటా సెంటర్ల నుంచి రక్షణ రంగ ప్రాజెక్టుల వరకు వివిధ పరిశ్రమలను తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. భారీ పెట్టుబడుల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన నీటి భద్రత చర్యల వల్ల ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగిందని అన్నారు.
గతంలో తాము రహదారులు నిర్మిస్తుంటే వాటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలను కోర్టు కేసులతో అడ్డుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ పేరుతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో ఫ్యాక్షనిజానికి పేరొందిన రాయలసీమను అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సీమలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అసూయపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించామని, సుమారు 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తిరిగి తమ ప్రభుత్వమే ప్రారంభించిందని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం దెబ్బతీసిందని, డయాఫ్రం వాల్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామని, నిర్మాణం పూర్తి చేయడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం, పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు తగ్గుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను అపహాస్యం చేసిందని విమర్శించారు. ఇప్పుడు ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు.








కామెంట్లు (0)