సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘వెలిగొండ’ నిర్వాసితులు జలసమాధి

1 గంట క్రితం

veligonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 01:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!

- వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు!

ప్రజాశక్తి - పెద్దారవీడు : వెలిగొండ నిర్వాసితులను ప్రభుత్వం జలసమాధి చేస్తోంది. కొందరు నిర్వాసితులు ఇంకా గ్రామాల్లో ఉండగానే నీళ్లొదిలింది. దీంతో, ప్రాథమిక సమాచారం ప్రకారం... ఒకరు మృతి చెందారు. ముగ్గురు గల్లంతయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం... వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో కొందరికి ఇంకా నష్టపరిహారం అందలేదు. వారిలో కొందరు పరిహారం కోసం నిర్వాసిత గ్రామాల్లోనే ఎదురుచూస్తున్నారు. నిర్వాసితులందరూ గ్రామాలను ఖాళీ చేశారా? లేదా? అనేది అధికారులు పరిశీలించకుండా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి నీటిని వదిలారు. ఆ సమయంలో లక్ష్మయ్య కుటుంబం నిర్వాసిత గ్రామమైన కలనూతలలోనే ఉంది. ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలినట్లు తెలుసుకొని నిరాశతో బొలేరో వాహనంలో సామాన్లతో సురక్షిత ప్రాంతానికి బయలుదేరింది. వరద నీటి ఉధృతికి వారి వాహనం కొట్టుకుపోయింది. దీంతో, కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందినట్లు, ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతైనట్లు సమాచారం. దీనిపై అర్ధరాత్రి 12 గంటల వరకూ అధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మార్కాపురం డిఎస్‌‌పి డాక్టర్ యు.నాగరాజు, పెద్దారవీడు ఎస్ఐ ఎం.సైదుబాబు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.

నీళ్లొదిలి నిండుప్రాణాలను బలి తీసుకోవడం శోచనీయం : సిపిఎం

నీళ్లొదిలి నిండు ప్రాణాలను బలి తీసుకోవడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టన్నెల్స్ నుండి వెంటనే నీటి విడుదలను ఆపి వేయాలని, కొట్టుకుపోయిన వాళ్లను రక్షించాలని, నిర్వాసిత గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్నీ సురక్షిత ప్రాంతానికి తరలించిన తర్వాతే వెలిగొండకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనేక కుటుంబాలు తమ పేర్లు గెజిట్ ప్రకటిస్తారని ఎదురుచూస్తూ ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో గ్రామాల్లోనే ఉన్నాయని, రిజర్వాయర్ కోసం వదిలి నీటిలో చిక్కుకుపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 31 లోపే జాబితాలు ప్రకటిస్తామని, రోజువారీ నిధులు విడుదల చేస్తామన్న పదేపదే చెప్పిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, ప్రభుత్వం ముందుగానే వాగ్దానం మేరకు అర్హుల జాబితా ప్రకటించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని పేర్కొన్నారు.

నీటి విడుదల నిలిపివేతకు మంత్రి ఆదేశం

ఈ ఘోర ఘటనపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి తీసుకెళ్లారు. దీంతో, మంత్రి వెంటనే స్పందించి నీటి విడుదల నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్