శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మిక హక్కుల రక్షణకు ఉధృత పోరాటాలు

03 అక్టోబర్, 2026

కార్మిక హక్కుల రక్షణకు ఉధృత పోరాటాలు
-ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య81వ వార్షికోత్సవ సభలో ఎవి నాగేశ్వరరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 08:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య 81వ వార్షికోత్సవ సభలో ఎవి నాగేశ్వరరావు

విశాఖ: హక్కుల రక్షణ కోసం ఉధృత పోరాటాలకు కార్మికవర్గం సమాయత్తం కావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య) 81వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా కార్మిక పోరాటాలు విస్తృతమవుతున్నాయన్నారు. సామ్రాజ్యవాద అమెరికా తన స్వలాభం కోసం ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని కొనసాగిస్తూ కార్మిక వర్గంపై పెను భారాలు మోపుతోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కార్మికుల పని గంటలు తగ్గిపోతున్నాయని వివరించారు. కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, జీవితాన్ని కల్పించాల్సింది పోయి వారి హక్కులను కాలరాసే విధంగా, ఉపాధికి నష్టం కలిగించే విధంగా మారడం దురదృష్టకరమన్నారు. సామ్రాజ్యవాదం ఉన్నంత వరకూ యుద్ధాలు తప్పవని, వాటివల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాల భారాన్ని పాలకులు తిరిగి ప్రజలపైనే మోపుతారని, ఫలితంగా ప్రజల జీవితాలు మరింత దుర్భరమవుతాయని వివరించారు. అందుకే కార్మిక వర్గమంతా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, దోపిడీ లేని సోషలిస్టు సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సహజ వనరులపై కార్పొరేట్ల పెత్తనం ఆపాలనే డిమాండ్లతో డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకు ‘ఢిల్లీని ఆక్రమిద్దాం’ నినాదంతో తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమానికి కార్మికులు భారీగా తరలిరావాలని కోరారు. సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతోందని, అందులో భాగంగానే కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్‌‌ను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం మోడీ విధానాలను అమలు చేస్తూ ప్రైవేటీకరణ విధానాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఎస్.జోతీశ్వరరావు, యు.రాజు, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్