- మంత్రి ఆనం వెల్లడి
- మూలా నక్షత్రం రోజున సిఎం పట్టు వస్ర్తాల సమర్పణ
ప్రజాశక్తి - విజయవాడ సిటీ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం విజయవాడలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడుతూ ఈ నెల 14న దుర్గమ్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని చెప్పారు. 15న సరస్ మేళాను ప్రారంభిస్తారని, ఉత్సవాలకు రోజుకు సగటున 2.5 లక్షల మంది, మొత్తంగా సుమారు 25 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడు హోల్డింగ్ ఏరియాల్లో సుమారు 30 వేల మంది వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత భవానీల కోసం మరో మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ సుజనా చౌదరి, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఒ శీనా నాయక్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)