- దుర్గమ్మ సన్నిధిలో మధ్యప్రదేశ్ సిఎం, చైనా రాయబారి, సినీ ప్రముఖులు
ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏడో రోజు జన సంద్రంగా మారింది. భవానీ మాలధారుల రాక విపరీతంగా పెరగడంతో శనివారం కొండపై క్యూలైన్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు యాత్రికులకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులతో పాటు 750 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, వంద మంది యూత్ రెడ్ క్రాస్ వలంటీర్లు యాత్రికులకు నిరంతరాయంగా సేవలదించారు. ఇంద్రకీలాద్రికి అంతర్జాతీయ, జాతీయ ప్రముఖుల రాకతో తీవ్ర కోలాహలం నెలకొంది.
దుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
ఎపి పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తర్వాత భారతదేశంలో చైనా రాయబారి జు ఫీహాంగ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు కుటుంబ సమేతంగా, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు... ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధర్మకర్తలు జాస్తి సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు బృందం, పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవస్థానం అధికారులు, విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, ఇఒ కె.శోభారాణి బృందం అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం దుర్గాష్టమి పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అవతారంలో అలంకరించనున్నారు.











కామెంట్‌లు (0)