ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా?

1 గంట క్రితం

ramadevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- గ్రామాలు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాల్సిందే

- 2019లోనే ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదు ?

- నిర్వాసితులను ముంచాలనుకుంటే ప్రతిఘటన తప్పదు : రమాదేవి

ప్రజాశక్తి - మార్కాపురం : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, చట్టాన్ని సైతం ప్రభుత్వమే ఉల్లంఘించి త్యాగం చేసిన నిర్వాసితులకు అన్యాయం చేస్తోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల్లో ప్రజలు 74 వేల ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు వదులుకున్నారని గుర్తు చేశారు. గృహాలకు తక్కువగా పరిహారం ఇచ్చిందని తెలిపారు. 2019లో అప్పటి ధరకు అనుగుణంగా ప్యాకేజీ నిర్ణయించారని, 2019 లోనే ఈ ప్యాకేజీ ఇచ్చి ఉంటే పొలం, గూడు కట్టుకునే అవకాశం ఉండేదన్నారు. ఏడేళ్ల క్రితం నిర్ణయించిన ప్యాకేజీని ఇప్పుడు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఆ ప్యాకేజీకి ఒక సెంటు స్థలం గానీ, ఒక ఎకరం పొలం గానీ రాదని చెప్పారు. కాంట్రాక్టర్లకు మాత్రం ధరలు పెరిగాయని అంచనాలు పెంచుకుంటూ లాభాలు చేకూర్చుతున్నారని, కాంట్రాక్టర్లపై చూపిన ప్రేమ, త్యాగం చేసిన నిర్వాసితులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోలేదని, టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అదే తీరుగా ఉందని విమర్శించారు. వెలిగొండ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటున్న సిఎం చంద్రబాబు నాయుడు.. నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం మార్కాపురంలోని టిడ్కో ఇళ్లను కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. ముందుగా నోటీసులు ఇచ్చి ఉంటే వ్యవసాయ పంటలు సాగు చేసి ఉండేవారు కాదని, ఇప్పటికిప్పుడు గ్రామాలు ఖాళీ చేస్తే.. పెట్టిన పెట్టుబడులు తిరిగి రావని అన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వమే ప్రత్యేక న్యాయం చూపాలని, లేని పక్షంలో ఖాళీ చేసేందుకు ఆరు నెలలు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి ప్రస్తుత ఆగస్టు చివరి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ప్యాకేజీకి అర్హులేనన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రెండు విడతలుగా గజిట్ విడుదల చేశారని, మూడో విడత కూడా ప్రభుత్వం గజిట్ విడుదల చేసి 18 ఏళ్లు నిండిన యువతను ఆదుకోవాలని కోరారు. వెలిగొండ నిర్వాసితులకు అన్యాయం చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్