సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఇంటి’ గోడు తీరేదెప్పుడో..!

1 గంట క్రితం

AP-HOUSE-HOUSES-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 03:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇళ్లు, ఇళ్లస్థలాల కోసం పేదల ఎదురు చూపులు

  • నేటికీ పరిష్కారం కాని రిజిస్ర్టేషన్‌ సమస్య

  • నేడు సిపిఎం ‘చలో కలెక్టరేట్‌’

ప్రజాశక్తి-ఎన్‌‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఏళ్ల తరబడి పేదల ఇళ్ల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఈ క్రమంలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రిజిస్ర్టేషన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ‘చలో కలెక్టరేట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందరికీ ఇళ్లు ఇస్తామన్న పాలకుల హామీలు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన నినాదాలు ప్రచార ఆర్భాటాలుగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వం ‘జగనన్న కాలనీ’ పేరుతో నగరవాసులకు స్థలం చూపకుండా పట్టాలు అందించి మోసం చేసింది. టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి నగర పరిధిలో కనీసం రెండు సెంట్ల ఇంటి స్థలం కేటాయింపు హామీ నేటికీ నెరవేరలేదు.

నగరంలోని కృష్ణలంక, భ్రమరాంబపురం ప్రాంతాల వాసుల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. భ్రమరాంబపురంలో సుమారు రెండు వేల ఇళ్లకు బి-ఫారం పట్టాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ సౌకర్యం లేక నివాసితులకు యాజమాన్య హక్కులు దక్కలేదు. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం లేక అత్యవసర వైద్యం, విద్యా అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ భూమిని నివాసయోగ్యంగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిఒ నంబరు 30 కింద దరఖాస్తులు స్వీకరించినా పట్టాలు ఇవ్వకుండా గడువును డిసెంబరు వరకు పొడిగించారు. కోర్టు కేసుల పేరుతో అధికారులు కాలయాపన చేయకుండా అర్హులైన బాధితులకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌, జక్కంపూడి, కబేళా ప్రాంతాల్లో పదేళ్ల క్రితం నిర్మించిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం జి+3 ఇళ్ల సముదాయాల్లో సిద్ధంగా ఉన్న దాదాపు వెయ్యి ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలేశారు. దీంతో ప్రస్తుతం అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. వందలాది ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ల కార్యకలాపాలతో స్థానిక ప్రజలకు రక్షణ కరువైంది. పేదలు సొంత ఇళ్లు లేక అధిక అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వాలు వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం జి+3 ఇళ్లతో పాటు మిగిలిపోయిన టిడ్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించాలని పేదలు కోరుతున్నారు. నగర పరిధిలో ఖాళీగా ఉన్న సుమారు 57 ఎకరాల డిస్నీల్యాండ్‌, వాంబే కాలనీ, రైల్వే స్థలాలు, ఎక్సెల్‌ చెత్త ఫ్యాక్టరీ స్థలాలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలకు కేటాయించకుండా పేదల ఇళ్ల స్థలాల కోసం వినియోగించాలని, ఎన్నికల హామీ మేరకు నగర సమీపంలో రెండు సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించి పంపిణీ చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్