సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజోథ్ పూర్ పై ఉన్న ప్రేమ.. ఉత్తరాంధ్రపై ఏది..?

1 గంట క్రితం

CTU-_FB.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 05:22 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • గిరిజన వర్సిటీకి శాశ్వత వనం కరువు

  • ఇంకా కంటైనర్లలోనే చదువులు

  • జోథ్ పూర్‌లో కుప్పలు తెప్పలుగా జాతీయ విద్యాసంస్థలు

  • రాజకీయ వివక్షతో వెనుకబడుతున్న ఉత్తరాంధ్ర

జోధ్‌పూర్‌ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే జాతీయ విద్యా సంస్థలు దేశంలో బలమైన మౌలిక వేదికలుగా ఎదగాలి. అప్పుడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, స్థానిక విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు ఏర్పడతాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం చూపుతున్న రాజకీయ వివక్ష కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పాటైన గిరిజన విశ్వవిద్యాలయం (ట్రైబల్ యూనివర్సిటీ) అభివృద్ధి వేగంతో పోలిస్తే, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వంటి నగరాల్లో ఉన్న జాతీయ విద్యా సంస్థల పురోగతి మరియు వసతుల కల్పన భిన్నంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ వ్యత్యాసాలను అధిగమించి, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యా సంస్థలను కూడా వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఎపి పాత్రికేయ బృందం రాజస్థాన్ లోని జోథ్ పూర్ నగరాన్ని, అక్కడ ఉన్న పలు జాతీయ విద్యాసంస్థలు, రీసెర్చ్‌ సెంటర్లు సందర్శించింది. ఈ సందర్భంగా ఒకే లక్ష్యంతో ఏర్పడిన విద్యాసంస్థలకు కేంద్రం అందించిన సహకారంలో భిన్న పరిస్థితులు కనిపించాయి. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో భాగంగా ఏర్పాటైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2018–19 విద్యాసంవత్సరం నుంచి వియజనగరానికి చేరువలో గల కొండకరకాంలోగల తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు ప్రారంభించింది. అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌, ఇంటిగ్రేటెడ్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌, పిహెచ్‌డి కోర్సులు నిర్వహిస్తున్నారు. సుమారు 550 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కనీసం గదులు కూడా సరిపోకపోవడంతో కంటైనర్లలో చదువులు సాగుతున్నాయి. ఇందుకు తగ్గ సదుపాయాలు లేకపోవడంతో 2026 జూన్‌ 30న ఇక్కడ జరగాల్సిన తొలి స్నాతకోత్సవం విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాక్షాత్తు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీన్నిబట్టి వర్సిటీలోని కార్యకలాపాలు విస్తరించినా.. దానికి తగ్గ శాశ్వత మౌలిక వసతులు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని స్పష్టమౌతోంది. మెంటాడ మండలం కుంటినవలస – చినమేడపల్లి ప్రాంతంలో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి 2023 ఆగస్టు 25న శంకుస్థాపన చేశారు. సుమారు రూ.305 కోట్ల అంచనా వ్యయంతో పనులు కొనసాగుతున్నాయి. కోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 2026 డిసెంబరులో, మిగిలిన పనులను 2027 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశ్వవిద్యాలయం ఏర్పడి ఏడేళ్లు దాటినా పూర్తిస్థాయి క్యాంపస్‌ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పకనే చెప్పారు.

జోధ్‌పూర్‌లోని జాతీయ సంస్థలను పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడి సెంట్రల్‌ అరిడ్‌ జోన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిఎజెడ్ఆర్ఐ), అరిడ్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఎఫ్ఆర్ఐ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్ టి), ఫేషన్ డిజైన్ అండ్ ‌డెవలప్‌‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ డిడిఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) వంటి జాతీయ సంస్థలు ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా విద్య, పరిశోధన, సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ ఆయా రంగాలకు అవసరమైన పరిశోధన, ప్రయోగశాలలు, శిక్షణ, మౌలిక వసతులతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సిఎజెడ్ఆర్ఐలో ఎడారి వ్యవసాయం, నీటి నిర్వహణ, సహజ వనరులపై పరిశోధనకు ప్రత్యేక వసతులు ఉన్నాయి. ఎఎఫ్ఆర్ఐలో శుష్క ప్రాంతాల అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. ఎఫ్ డిడిఐలో డిజైన్‌, సాంకేతిక విద్య, ప్రయోగశాలలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్‌ శిక్షణకు ప్రాధాన్యం కనిపిస్తోంది. ఎన్ఐఎఫ్ టిలో ఫ్యాషన్‌ డిజైన్‌, టెక్నాలజీ, పరిశ్రమ అనుసంధానానికి అనుగుణంగా విద్యా వసతులు ఉన్నాయి. ఈవన్నీ ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టుగా ఏర్పడిన జాతీయ సంస్థలే.

మన రాష్ర్టంలో మాత్రం అటువంటి శ్రద్ధ చూపలేదు. ముఖ్యంగా విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా ఉత్తరాంధ్రతోపాటు అటు ఒడిశా అటవీ ప్రాంతంలో గిరిజన వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, పోషకాహారం, ఔషధ మొక్కలు, గిరిజన భాషలు, సంస్కృతి, జీవనోపాధులపై విస్తృత పరిశోధనకు అవకాశం ఉంది. కానీ ఈ అంశాలపై జాతీయ స్థాయి పరిశోధనకు అవసరమైన శాశ్వత క్యాంపస్‌, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, గ్రంథాలయం, హాస్టళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం ఆలస్యమవుతోంది. విభజన చట్టానికి పన్నెండేళ్లు.. విశ్వవిద్యాలయం ఏర్పడి ఏడేళ్లు.. శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన చేసి మూడేళ్లు.. అయినా పూర్తి స్థాయి వసతులకు ఇంకా గడువు అవసరం అవుతోంది. ఉత్తరాంధ్రకు కేంద్రం ఇచ్చిన విభజన హామీ అమలులో ఈ జాప్యం ఎందుకు? జోధ్‌పూర్‌లో కనిపిస్తున్న స్థాయి మౌలిక వసతులు ఉత్తరాంధ్రాలోని గిరిజన విశ్వవిద్యాలయానికి ఎప్పటికి అందుతాయి? గిరిజన యువతకు జాతీయ స్థాయి పరిశోధన వేదిక ఎప్పటికి సిద్ధమవుతుంది? ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్న కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, గిరిజన యువత భవిష్యత్తు, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ హామీ అమలుకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్