ఇన్‌సర్వీస్ టీచర్ల స్పెషల్ టెట్ - 2026 ప్రత్యేకం
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష–ఆగస్టు2026 నోటిఫికేషన్‌ను ఆగస్టు 24న విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ షెడ్యూల్ పేర్కొంది. ప్రాథమిక కీ అక్టోబర్ 24న, తుది కీ నవంబర్ 10న, తుది ఫలితాలను నవంబర్ 15న ప్రకటించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక టెట్ సాధారణంగా ఉద్యోగాల కోసం కొత్తగా అభ్యర్థులు రాసే టెట్‌కు భిన్నమైన ఉద్దేశంతో రూపొందించబడింది.ఇప్పటికే సేవలో ఉన్న అర్హులైన ఉపాధ్యాయులు టెట్ అర్హతను పొందేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం, ప్రత్యేక టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం ప్రస్తుత హోదాలో కొనసాగడానికి లేదా ప్రస్తుత హోదా నుంచి తదుపరి ఉన్నత హోదాకు పదోన్నతి పొందడానికి అవసరమైన తప్పనిసరి అర్హతను నెరవేర్చడానికి ఉద్దేశించబడింది. అయితే ఈ ప్రత్యేక టెట్ అర్హతను భవిష్యత్తులో ప్రత్యక్ష ఉపాధ్యాయ నియామకాలకు ఉపయోగించలేరు. ప్రత్యక్ష నియామకాలకు సాధారణ ఏపీ టెట్ లేదా సీటెట్ అర్హత అవసరమని నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక పరీక్ష ప్రత్యేక టెట్ నిర్వహణకు ప్రధాన నేపథ్యం సుప్రీంకోర్టు తీర్పులు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సెప్టెంబర్1న సివిల్ అప్పీల్ నంబర్ 1385/2025లో సుప్రీంకోర్టు టెట్ అర్హతను సంబంధిత ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తప్పనిసరి చేసింది. అనంతరం 2026 మే29న దాఖలైన సమీక్ష పిటిషన్లపై సుప్రీంకోర్టు టెట్ అర్హతను తొలగించేందుకు జోక్యం చేసుకోలేదు. వివిధ రాష్ట్రాలు, సంబంధిత వర్గాలు వ్యక్తం చేసిన ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అర్హత సాధించేందుకు గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. నిర్దేశిత కాలంలో అర్హత సాధించేందుకు వీలుగా టెట్లను క్రమం తప్పకుండా, సాధ్యమైనంత వరకు సంవత్సరానికి రెండుసార్లు, సుమారు ఆరు నెలల వ్యవధితో నిర్వహించాలని సూచించింది. ఈ న్యాయపరమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్‌ను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. నోటిఫికేషన్‌లో2026 జూన్ 25, ఆగస్టు 24 తేదీల ప్రభుత్వ మెమోలను కూడా ప్రస్తావించింది. 2011కు ముందు నియమితులైన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు నిర్దేశిత గడువులో టెట్ అర్హత పొందేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొనబడింది.
ఎవరికి ఈ ప్రత్యేక టెట్?
నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థలు, ఏపీ మోడల్ పాఠశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ రెగ్యులర్, కనీస కాలపరిమితి వేతనంపై నియమితులైన ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్‌కు అర్హులుగా పేర్కొన్నారు. అయితే అభ్యర్థి తనకు వర్తించే పూర్తి అర్హతలను సమాచార బులెటిన్‌లో పరిశీలించుకోవాలి.
ప్రత్యేక టెట్ రెండు పేపర్లుగా ఉంటుంది.
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే వారికి పేపర్–1
ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే వారికి పేపర్–2 ఉంటుంది.
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయులు,అవసరమైన ఇతర అర్హతలు కలిగి ఆరు నుంచి ఎనిమిదో తరగతులకు కూడా బోధించాలనుకుంటే రెండు పేపర్లకు హాజరుకావాల్సి ఉంటుంది.
పేపర్ 1 ఎవరి కోసమంటే..
ప్రభుత్వ,స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు డి.ఎల్.ఎడ్,బి.ఎడ్ అర్హతలు కలిగి ఉంటే పేపర్–1కు హాజరుకావచ్చు. రెండు అర్హతలు కలిగిన ఎస్‌జీటీలు పేపర్–1తో పాటు పేపర్–2కు కూడా అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పేపర్–2 ఎవరి కంటే : స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు,భాషా పండితులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేపర్–2కు హాజరుకావచ్చు. పీఎస్ హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు తమ సంబంధిత సబ్జెక్టులో పేపర్–2రాయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పరీక్ష స్వరూపం రెండు పేపర్లలోనూ150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి.
పరీక్ష సమయం రెండు గంటల 30 నిమిషాలు.
ప్రశ్నలకు నాలుగు ప్రత్యామ్నాయాలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు ఒక సరైన సమాధానం ఉంటుంది. ప్రతికూల మార్కుల విధానం లేదు.
పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతుంది. అక్టోబర్11 నుంచి21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
హాల్‌టికెట్లు అక్టోబర్ 5 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పేపర్–1నిర్మాణం
పేపర్–1లో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి.
బాలల అభివృద్ధి–బోధనాశాస్త్రం30 ప్రశ్నలు,
భాష–1 30 ప్రశ్నలు,
భాష–2గా ఇంగ్లిష్ 30 ప్రశ్నలు,గణితం30 ప్రశ్నలు, పర్యావరణ విద్య 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం150 ప్రశ్నలకు150 మార్కులు ఉంటాయి.
భాష–1గా తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్ భాష–2గా తప్పనిసరి.
భాష–1గా ఇంగ్లీషును ఎంచుకునే అవకాశం లేదు. అభ్యర్థి తాను ఎంచుకునే భాషను పదో తరగతి వరకు మాధ్యమంగా లేదా మొదటి భాషగా చదివి ఉండాలి లేదా ఇంటర్మీడియట్‌లో రెండో భాషగా చదివి ఉండాలి. సంబంధిత భాషను డిగ్రీ స్థాయిలో చదివి,డి.ఎల్.ఎడ్‌లో సంబంధిత బోధనా పద్ధతిని చదివినవారికి కూడా నిబంధనల ప్రకారం అవకాశం ఉంటుంది.
బాలల అభివృద్ధి–బోధనాశాస్త్రంలో విద్యా మనోవిజ్ఞానం, బాలల ఎదుగుదల, అభివృద్ధి, వ్యక్తిత్వ సిద్ధాంతాలు, వ్యక్తిగత భేదాలు, అభ్యసనం, మూల్యాంకనం, మానసిక ఆరోగ్యం, మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ వంటి అంశాలను ప్రాథమిక స్థాయికి అనుగుణంగా పరీక్షించనున్నారు.
ఈ విభాగానికి రూపొందించిన పాఠ్యాంశం రాష్ట్ర డి.ఎల్.ఎడ్ పాఠ్య ప్రణాళిక ఆధారంగా ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
పేపర్–1సిలబస్‌కు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అంశాలను ఆధారంగా తీసుకుని, పదో తరగతి స్థాయి వరకు అనుసంధానం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రశ్నలు కేవలం జ్ఞాపకశక్తిని కాకుండా విమర్శనాత్మక, సృజనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పేపర్–2నిర్మాణం *పేపర్–2లో కూడా బాలల అభివృద్ధి–బోధనాశాస్త్రం30 ప్రశ్నలు,భాష–1 30 ప్రశ్నలు,భాష–2ఇంగ్లిష్30 ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన60 ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకునే విభాగాన్ని బట్టి ఉంటాయి.
గణితం–విజ్ఞానం ఎంచుకునేవారికి గణితం,భౌతిక విజ్ఞానం, జీవ విజ్ఞానం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి.
గణితం,భౌతిక విజ్ఞానం, జీవ విజ్ఞానంలో విషయ పరిజ్ఞానం,బోధనాశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.సాంఘిక శాస్త్రాన్ని ఎంచుకునే వారికి48 ప్రశ్నలు విషయ పరిజ్ఞానంపై, 12ప్రశ్నలు బోధనాశాస్త్రంపై ఉంటాయి.
పేపర్–2లో భాష–1గా తెలుగు, ఉర్దూ,హిందీ,కన్నడ,తమిళం,ఒడియా,సంస్కృతం భాషలను ఎంచుకోవచ్చు.
ఇంగ్లీష్ భాష–2గా తప్పనిసరి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సిలబస్‌ను ఆధారంగా తీసుకుని,ఇంటర్మీడియట్ స్థాయి వరకు అంశాల అనుసంధానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రశ్నలు భావనాత్మక అవగాహన,విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయని బులెటిన్ పేర్కొంది. ప్రశ్నా పత్రం మాధ్యమం ప్రశ్నపత్రం ద్విభాషా విధానంలో ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్‌లో, ఆ తరువాత అభ్యర్థి ఎంచుకున్న భాషలో ప్రశ్నలు ఉంటాయి.
పేపర్–2లో సంస్కృతాన్ని భాష–1గా ఎంచుకునే వారికి బాలల అభివృద్ధి–బోధనాశాస్త్రం తెలుగు తరువాత సంస్కృతంలో,
భాష –2 ఇంగ్లీష్,మిగిలిన ప్రశ్నపత్రం సంస్కృతంలో ఉంటుందని బులెటిన్‌లో పేర్కొన్నారు. హిందీ లేదా సంస్కృత మాధ్యమంలో భాషేతర సబ్జెక్టులకు ప్రత్యేక మాధ్యమ ఎంపిక లేదని కూడా స్పష్టం చేశారు. ఉత్తీర్ణత మార్కులు 150 మార్కులకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో వర్గాల వారీగా కనీస ఉత్తీర్ణత మార్కులను నిర్ణయించారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం అంటే కనీసం 90 మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులకు 50 శాతం అంటే 75 మార్కులు,ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ,మాజీ సైనికులకు 40 శాతం అంటే 60 మార్కులు అవసరం. ఈ కనీస మార్కులు ప్రతి పేపర్‌కు వర్తిస్తాయి. అందువల్ల రెండు పేపర్లు రాసే అభ్యర్థులు తాము రాసే ప్రతి పేపర్‌కు వర్తించే ఉత్తీర్ణత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకోవాలి.
సర్టిఫికెట్ చెల్లుబాటు ప్రత్యేక టెట్ పాస్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుందని బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఈ నిబంధన ఎన్‌సీటీఈ 2021 జూన్9 మార్గదర్శకాలు,ప్రభుత్వం2021 అక్టోబర్25న జారీ చేసిన ఉత్తర్వులతో అనుసంధానించబడింది.
భవిష్యత్తులో ఎన్‌సీటీఈ మార్గదర్శకాల్లో మార్పులు వస్తే చెల్లుబాటు నిబంధనలో మార్పు ఉండొచ్చునని నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది.
ప్రత్యేక టెట్ రాయడానికి ప్రయత్నాల సంఖ్యపై పరిమితి లేదు.
అర్హత పొందే వరకు అభ్యర్థి ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావచ్చని బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఉత్తీర్ణులైన వారికి డిజిటల్ రూపంలో మెమో,పాస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఫలితాలు ప్రకటించిన తరువాత సర్టిఫికెట్లు డిజిలాకర్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థి ముందుగా నమోదు చేసుకుని జర్నల్ నంబర్ పొందాలి.
జర్నల్ నంబర్ రావడం మాత్రమే దరఖాస్తు పూర్తయినట్లు కాదు. ఆన్‌లైన్ దరఖాస్తును తుది సమర్పణ చేసి,నిర్ణీత రుసుము చెల్లించినప్పుడే దరఖాస్తు పూర్తయినట్లు పరిగణిస్తారు.
ఒక్కో పేపర్‌కు రూ.1,000 రుసుము చెల్లించాలి.
రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు విడిగా రుసుము చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియలో ఫొటో, సంతకం వంటి వివరాలను బులెటిన్‌లో సూచించిన విధంగా అప్‌లోడ్ చేయాలి.
ఫొటో పరిమాణం 3.5 × 3.5 సెం.మీ.ఉండాలి.
ఫొటో–సంతకం కలిపిన స్కాన్ చిత్రాన్ని జేపీఈజీ రూపంలో 50 కిలోబైట్లకు మించకుండా సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఫొటో స్పష్టంగా, సరైన పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. అభ్యర్థి వివరాలు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. లేకపోతే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది. తుది సమర్పణకు ముందు వివరాలను సరిచూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థిదే.
పరీక్షా కేంద్రాలు ప్రత్యేక టెట్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.
పరీక్షా కేంద్రం లేదా సెషన్ మార్పు కోరే అవకాశం లేదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
హాల్‌టికెట్ అక్టోబర్ 5 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నార్మలైజేషన్ విధానం పరీక్షను వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించిన సందర్భంలో మార్కులను సమానీకరించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
వేర్వేరు షిఫ్టుల్లో ప్రశ్నపత్రాల కఠినతలో తేడా ఉంటే గణాంకపరమైన పద్ధతిలో మార్కులను సమన్యాయం చేయడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తారు.
మార్కుల లెక్కింపు ఐదు దశాంశాల వరకు జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అసలు మార్కులపైనే దృష్టి పెట్టాలి. నార్మలైజేషన్ అనేది షిఫ్టుల మధ్య గణాంకపరమైన తేడాలను సరిచేసే విధానం మాత్రమే. కీ,అభ్యంతరాలు,ఫలితాలు అక్టోబర్ 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు.అక్టోబర్25 నుంచి నవంబర్ 1 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఎస్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసే సబ్జెక్టు నిపుణుల కమిటీ ప్రాథమిక కీపై అభ్యంతరాలను పరిశీలిస్తుంది.ఆ కమిటీ నిర్ణయం తుది అధికారంగా ఉంటుంది. తుది కీపై అభ్యంతరాలు స్వీకరించబోమని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

కె.ఎస్.లక్ష్మణరావు
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు,
మాజీ శాసనమండలి సభ్యులు,
సెల్: 8309965083








కామెంట్‌లు (0)