ప్రముఖ కథా, నవలా రచయిత అట్టాడ అప్పలనాయుడు గడిచిన రెండు దశాబ్దాలలో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రచురించిన సాహిత్య, సామాజిక, రాజకీయ వ్యాసాలు కలగలిపి ‘తంపర’ వ్యాస సంపుటిగా వెలువరించారు. ఇందులోని 64 వ్యాసాలను సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలుగా విభజించారు. ఈ సంపుటిలోని ప్రతి వ్యాసం వైవిధ్యభరితమైన అంశాలను స్పృశించడమే కాకుండా, వినూత్నమైన ఆలోచనా విధానాన్ని వ్యక్తం చేస్తుంది.
“అదిగదిగో తీర ప్రాంతమదేనంట ఉద్దానం” అనే వ్యాసంలో సోంపేటలో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వాలు ఎలాంటి ఎత్తులు వేశాయి? సోంపేట ప్రజలు ఎలా తమ తిరుగుబాటుతో దాన్ని నిలువరించగలిగారు? అశోకుని కాలం నాటి కారువాకి మొదలు, 1937లో ప్రారంభమైన ఆంధ్ర రైతు రక్షణ యాత్ర, 1940లో టెక్కలి ప్రాంత రైతుల సత్యాగ్రహం, 1960లో జరిగిన జమీందారీ రద్దు పోరాటాలు, గిరిజన రైతాంగ పోరాట చరిత్ర మొదలైన ఉత్తరాంధ్ర సంబంధమైన చారిత్రక ఘట్టాలను ప్రస్తావించారు. సోంపేట థర్మల్ విద్యుత్ కేంద్రం వ్యతిరేక ఉద్యమం వరకు ఎన్నో చారిత్రక అంశాలను నమోదు చేశారు. ఉద్దానం పంటలు, బీల జీవవైవిధ్య వివరాలను ప్రస్తావించేటప్పుడు రచయిత పర్యావరణ పరిశీలన మనకు అవగతమవుతుంది. రైతుల నుంచి భూములను స్వీకరించడానికి రాజకీయ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ఎవరెవరు ఎలా ప్రవర్తించారో తెలిపిన విధానం వ్యవస్థ పట్ల వారికున్న అవగాహనను తెలియజేస్తుంది. “ఒకానొక కుట్ర కేసు” అనే వ్యాసంలో పార్వతీపురం కుట్ర కేసు నుంచి ప్రారంభించి ప్రభుత్వాలు ఏ కారణం లేకుండానే ఎలా చంపేయగలుగుతాయో ప్రొఫెసర్ సాయిబాబా గురించి, తూత్తుకూడి జనాల పోరాటం గురించి తెలుసుకోమంటారు. “వోయ్ తెల్లోడికైనా నల్లోడికైనా పాలక భాష ఒకటేనోయ్” అన్న వాక్యం నేటి వ్యవస్థ వైఖరిని వ్యంగ్యాత్మకంగా ప్రకటిస్తోంది. “రూల్సోడు - ఎర్రసూరి” అనే వ్యాసంలో మనకి అవసరమని అడిగినవి పాలకుల దృష్టిలో పనికిరాని కోరికలని, వాళ్లకు లాభం తెచ్చేవి మనకు అనవసరమైన వాటిని మన నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తారని ప్రకటిస్తారు.
“లోక్‌పాల్ కమిటీలు” వ్యాసంలో అన్నా హజారే పోరాట ఫలితంగా ఏర్పడిన లోక్‌పాల్ కమిటీల వలన పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని భవిష్యత్తును అంచనా వేశారు రచయిత. “అవినీతి వ్యతిరేక చట్టాలు ఇప్పటికే బుట్టడున్నాయి. చట్టం ముందు అందరూ సమానం కాదు. కొందరు ఎక్కువ సమానం. ఇది కీలకం. దీన్ని దిద్దాలి. లోక్‌పాల్‌లో పౌరులున్నా, అపౌరులున్నా నీటి మీద రాతకు మించి ఉపయోగముండదు” అని వ్యాసకర్త అన్న మాటలు తదనంతర కాలంలో నిజమని రుజువయ్యాయి. “రెండొందలేళ్ల విశ్వ మానవుడు మార్క్స్” అనే వ్యాసంలో మార్క్స్ శ్రమ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయకపోయి ఉంటే ఆధిపత్య వర్గాల చేతిలో ప్రపంచ ప్రజలంతా మగ్గిపోయేవారని అంటారు. కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు బలంగా నాటుకుపోయిన ఈ సమాజంలో మార్క్స్ ఒక్కడే ఒకరి కోసం ఒకరం, ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరం అంటూ సమిష్టితత్వాన్ని వ్యక్తం చేసి ప్రపంచ ఆర్థిక పరిణామాన్ని తార్కికంగా అంచనా వేశాడని స్పష్టం చేశారు.
“మహిళాదిన సంబరాలు” వ్యాసంలో పట్టణాల్లో పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్న కొద్దిమంది స్త్రీలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన కుటుంబాల్లోని స్త్రీలు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, కూలి పనికి వెళ్లే ఆడవాళ్లు మగ కూలీల కన్నా తక్కువ వేతనాన్ని పొందుతున్న ఈ వ్యవస్థలో ఎంతమందికి నిజంగా మహిళా దినోత్సవం ప్రయోజనకరమైందని ప్రశ్నిస్తారు. “మహిళా మార్గం” అనే వ్యాసంలో నేటికీ చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం ఎదురుచూస్తున్న మహిళల పరిస్థితిని వివరిస్తూ, “మహిళలకి కావాల్సింది అర్ధ సింహాసనమో, ఆకాశంలో సగభాగమో మాత్రమేనా? పాడులోకాన్ని మరమ్మతు సేసి పావన బృందావనం సెయ్యడం గదా మహిళ మానసం!” అంటూ స్త్రీల విశాల దృక్పథాన్ని వివరించారు. “పునరారంభం” అనే వ్యాసంలో ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక సంస్థ ఆవిర్భావ లక్ష్యాలని వివరిస్తూ, సాహిత్య పరంగా సంఘటితంగా ఇక్కడి కవులు, రచయితలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటారు. “శిక్కోలు లెక్క”, “ఉపాధి కళలు”, “ఉత్తరాంధ్ర ఊసులు” వంటి వ్యాసాలు ఈ ప్రాంత వాసుల పరిస్థితిని, ఇతర ప్రాంతీయుల ఆధిపత్యాన్ని, ప్రాణం తీసే ప్రాజెక్టుల మీద ఇక్కడ ప్రజలు చేస్తున్న పోరాటాల్ని కళ్లకి కడతాయి.
“ఋతువులిపుడు చక్కగా చావుల్ని పండిస్తున్నాయి”, “వెన్నుపోటు పొడడంలో ఒలంపిక్స్‌కి కోచ్‌లు మీరు”, “పల్లెల నరాల్ని పిండేసి నగరాలని బలిపిస్తారు”, “వల్లకాడిపుడు ఊరవతల లేదు. ఇంటింటా, ఊరూరా..” వంటి కవితాత్మక వాక్యాలు నేరుగా మనసును తాకుతాయి. మొత్తంగా ఈ వ్యాస సంపుటి సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలతో పాటు ప్రాంతీయ సమస్యలు, ప్రజా పోరాటాలు, పర్యావరణం, మతమౌఢ్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రపంచీకరణ, అధికార ఆధిపత్యం, ప్రజావ్యతిరేక విధానాలు, మానవత్వం వంటి అనేక అంశాలను స్పృశిస్తుంది. ఇందులోని వాక్యాలు వ్యంగ్యాత్మకంగా, కవితాత్మకంగా, యథార్థంగా సాగుతూ బహుముఖ చారిత్రక, సామాజిక, రాజకీయ సాక్ష్యంగా నిలుస్తాయి.
- డా. కె. ఉదయ్ కిరణ్
8500707850








కామెంట్‌లు (0)