ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి చేపల వేటకు వెళ్లి బోటు బోల్తా పడిన సంఘటనలో గల్లంతయిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ సోమవారం మధ్యాహ్నం వరకు తెలియలేదు. దీంతో ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలవారు, వారికి మద్దతుగా అనేకమంది మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ లోని జెడి ఫిషరీష్ కార్యాలయానికి సమీపంలో సోమవారం ఉదయం నుంచి నిరసన చేపట్టారు. గల్లంతయిన ఏడుగురిలో బోటు యజమాని కర్రి చిన్న ఒక్కరు మాత్రమే క్షేమంగా బయటపడగా, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు మరొకసారి ప్రకటించారు. ఇది ఇలా ఉండగా రాధా రంగా రాయల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదే బాలాజీ ఆధ్వర్యంలో మత్స్యకారులంతా ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ... మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మత్స్యకారుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గల్లంతయిన మత్స్యకారుల కోసం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారో తమకు తెలియటం లేదని ఆరోపించారు. మేకనైజ్డ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ నిరసన తెలుపుతున్న మత్స్యకారులకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ... మత్స్యకారులు గల్లంతయిన విషయాన్ని కలెక్టర్ తో సహా అందరూ అధికారులకు తాను చాలా ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులు వేగంగా స్పందించి ఉంటే గల్లంతైన మత్స్యకారుల ప్రాణాలు దక్కేవి అని అన్నారు. అధికారులు కూటమి ప్రభుత్వం మంత్రులు కలిసి గల్లంతయిన మత్స్యకారులను రక్షిస్తామని ప్రకటనలు చేయడం మినహా, వారు చేపట్టిన చర్యలపై సందేహాలు ఉన్నాయన్నారు. శనివారం సంఘటన జరిగిందని రెండు రోజులు గడిచినప్పటికీ ఆచూకీ తెలియని కారణంగా, ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలతో ఉన్నారా లేదా ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వారిని ఓదార్చే తీరిక కూడా కూటమి మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు లేదా అని ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)