సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎస్‌‌సి కుంభకోణంపై విచారణకు ఎందుకు భయం

55 నిమిషాల క్రితం

jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసిపి అధ్యక్షులు జగన్‌‌మోహన్‌‌రెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌‌సి స్కాంపై సిబిఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం ? ఉక్రోషం అని వైసిపి అధ్యక్షులు జగన్‌‌మోహన్‌‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌‌లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. స్కామ్‌లు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే కూటమి ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి వైసిపి నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారని, లాఠీలతో కొట్టించారని, టీచర్ల ముసుగులో టిడిపి రౌడీలతో దాడులు చేయించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేకుండా చేశారని విమర్శించారు. డిఎస్‌‌సిలో స్కామ్‌లు చేశారని, అందుకే అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని తెలిపారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్‌‌తో ముడిపడిన నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. తప్పు జరగలేదని నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నరో చెప్పాలని కోరారు. టీచర్‌ పోస్టులకోసం లక్షల మంది యువత సంవత్సరాల తరబడి చదువుతారని, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారని అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ స్కాముల వల్ల ఎవరికీ ఉద్యోగాలు రాకుండా పోయాయని వివరించారు. పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్‌ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకురావని తెలిపారు. సిబిఐతో నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకువస్తుందని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరని, ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరని పేర్కొన్నారు. డిఎస్‌‌సి అభ్యర్థులకు న్యాయం జరగాలని, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్