- స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- నర్సీపట్నంలో జయహో బిసి మహాసభ
ప్రజాశక్తి - గొలుగొండ (అనకాపల్లి జిల్లా) : బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రయోజనకరమని, దీనివల్ల వారికి విస్తృత అవకాశాలు లభిస్తాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలను బిసి నాయకులు గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బుధవారం నిర్వహించిన ‘జయహో బిసి’ సభలో స్పీకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడుగు, బలహీన తరగతులు జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. బిసిల జీవితాల్లో వెలుగు నింపిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపే విధంగా సభకు హాజరైన ప్రజలంతా సెల్‌ఫోన్ లైట్లు వెలిగించాలని కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిసి తరగతులు జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ఎన్‌టిఆర్ కొనసాగించిన ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... బిసిల భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే లక్ష్యంగా నర్సీపట్నంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది బిసి బిడ్డలపై దౌర్జన్యాలు జరిగాయని ఆరోపించారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేసిన ఘటనను గుర్తుచేసుకుంటూ సభా ప్రాంగణంలో ప్రజలు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించగా, నాయకులు కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా నాయకులు 53 దీపాలను వెలిగించారు. ఈ సభలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, బిసి నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)