సరస్ మేళా ప్రారంభ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
స్వయం ఎపి’ బ్రాండ్‌తో అంతర్జాతీయ గుర్తింపు : సిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక, సాంకేతిక, సామాజిక సాధికారత దిశగా కొత్త మార్గం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడ పున్నమీఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను ఆమె గురువారం ప్రారంభించారు. రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఆర్థిక నిర్ణయాల్లో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కూడా పెరిగిందని వెల్లడించారు. దేశంలోని సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళల పాత్ర నిరంతరం పెరుగుతుండటం శుభపరిణామమని చెప్పారు. .
వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల ద్వారా గ్రామీణ మహిళలకు గత దశాబ్ధి కాలంలో ఆచరణాత్మక ప్రోత్సాహం లభించిందని చెప్పారు. దీని ఫలితంగా వారి అభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయన్నారు. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమర్థవంతంగా తోడ్పడుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దీంతో సామూహిక వ్యాపార అవకాశాలు విస్తృతమయ్యాయని చెప్పారు. ‘అంత్యోదయ’ అనే విస్తృత దృక్పథంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో మహిళా నాయకత్వంలోని సంస్థలకు స్థానం కల్పించిందన్నారు. ఫలితంగా మహిళలు గ్రామాల రూపురేఖలను మార్చడంలో నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఇవి స్థిరమైన జీవనోపాధి అభివృద్ధికి వేగంగా తోడ్పడుతున్నాయని తెలిపారు. ఈ మిషన్ ద్వారా ఐదు కోట్లకు పైగా గ్రామీణ మహిళా రైతులను అనుసంధానించారని, అలాగే లక్షలాది వ్యవసాయేతర సంస్థలకు సహాయం అందించారని చెప్పారు. ప్రభుత్వం ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళా సాధికారతకు ఒక ప్రత్యేకమైన దిశను, వేగాన్ని అందించిందని తెలిపారు. డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి అనేక ఆధునిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు లభించాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వేదికలుగా సరస్ మేళాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. పట్టణ మార్కెట్లతో నేరుగా అనుసంధానం అయ్యే అవకాశాలు లభిస్తున్నాయని, మార్కెటింగ్ సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్నాం .. చంద్రబాబు
గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు స్వయం ఎపి బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, మరో ఐదు లక్షల మందిని ఆ దిశగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జాతీయ సరస్ మేళాలో 650 స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇది కేవలం 14 రోజులపాటు జరిగే ప్రదర్శన కాదని, గ్రామీణ మహి ళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు.. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్ వేదికల ద్వారా స్వయం ఏపీ పేరుతో మార్కెటింగ్ చేస్తామని తెలిపారు. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.
స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించేందుకు ప్రధాని మోదీతో పాటు ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం తీసుకున్నారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సాంకేతిక సాయంతో ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. లక్ పతీ దిదీలను తీర్చిదిద్దటంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. షీ మార్టుల ద్వారా ఎస్హచ్జి సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణంలో స్వయం సహాయ సంఘాల మహిళల భాగస్వామ్యం పెద్దఎత్తున ఉండాలన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. లక్పది దీదీలతో గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అనిత తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)