సిజెఐకి రాసిన లేఖ అనుబంధ పిటిషన్‌గా మార్పు
స్వయంగా వాదనలు వినిపించిన సిపిఎం ఎంపి
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రతిపక్షాల నేతలు, విద్యార్థులు, యువజన, సామాజిక కార్యకర్తలపై ఢిల్లీ పోలీసుల అరాచక దాడులపై సర్వోన్నత న్యాయస్థానంలో సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్‌బ్రిట్టాస్ గళమెత్తారు. పోలీసులు రాజ్యసభ సభ్యుడినైన తనపై సైతం సాగించిన అమానవీయ దాడిని కళ్లగట్టెలా న్యాయస్థానం ఎదుట గురువారం నాడు ఆయన స్వయంగా విన్నవించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నవారిపై ఢిల్లీ పోలీసులు సాగించిన దాడులు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఆంక్షల విధించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు బ్రిట్టాస్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనపైనా పోలీసులు దాడి చేశారని, ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని ఆయన విన్నవించారు. బ్రిట్టాస్ లేఖను ఈ నెల 12న సుప్రీంకోర్టు కార్యాలయం ఈ లేఖను అనుబంధ దరఖాస్తుగా నమోదు చేసింది. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వెలుపల జాన్ బ్రిట్టాస్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తనపై చేసిన దాడిని వివరించారు. ఈ నెల 11న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎటువంటి కారణం లేకుండా, నోటీసు ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్ర రిజర్వు పోలీసు బలగాల (సిఆర్పిఎఫ్) తనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనను సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లారని, ఆ తర్వాత పోలీసు వాహనంలోనూ తనపై దాడి చేశారన్నారు. అనంతరం రహదారి పక్కన పడేసిపోయారని, తీవ్రంగా గాయపడిన తాను ఆసుపత్రిలో చేరాల్సిన దారుణ పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసుల సాగించిన ఈ దాడిపై న్యాయపర జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సిజెఐకి తాను లేఖ రాయగా..ఇప్పటికే ఇందుకు సంబంధించిన అంశాలపై పెండింగ్‌లో ఉన్న ప్రధాన కేసుకు అనుసంధానిస్తూ ‘ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్’గా మార్చారని బ్రిట్టాస్ తెలిపారు. ఆ పిటిషన్ గురువారం నాడు విచారణకు వచ్చిందని, న్యాయవాది సహాయం లేకుండా నేరుగా వాదించే అవకాశం కూడా తనకు లభించిందని తెలిపారు. దీంతో నాటి పోలీసుల అరాచక దాడుల వైనాన్ని సిజెఐ ధర్మాసనానికి వివరించినట్లు తెలిపారు. సావధానంగా ఆలకించిన సిజెఐ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామని తెలియజేసినట్లు బ్రిట్టాస్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, అసమ్మతిని వ్యక్తం చేసే హక్కు, చట్టబద్ధ పాలనకు సంబంధించిన రాజ్యాంగ హామీలను న్యాయస్థానం పరిశీలిస్తుందనే ఆశాభావం ఈ నమోదు ద్వారా కలిగిందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడం, న్యాయం కోసం చేసే విజ్ఞప్తులను ఆలకించడం న్యాయవ్యవస్థ బాధ్యత అని తెలిపారు. కాగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ తదితరులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్లో కూడా బ్రిట్టాస్ లేఖను పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసనలపై విధించిన ఆంక్షలు, నిరసనకారుల పట్ల పోలీసుల వ్యవహారశైలికి సంబంధించిన అంశాలు ఈ కేసు పరిధిలో ఉన్నాయి.
న్యాయస్థానంపై విశ్వాసముంది..సానుకూల డిక్రీ వస్తుంది ...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా ఇండియాబ్లాక్ దాఖలు చేసిన పిటిషన్‌కు సుప్రీం కోర్టులో సానుకూలంగా తీర్పు వెలువడుతుందని భావిస్తున్నట్లు ఎఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యలోనూ జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పనితీరు, ఢిల్లీ పోలీసుల నిరంకుశ నిర్ణయాలు, చర్యలు, పౌర స్వేచ్ఛల అణచివేతలపై ఈ పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు నుండి సానుకూలమైన డిక్రీ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఇండియా బ్లాక్ పిటిషన్‌తో తన లేఖను అనుబంధంగా చేర్చారని, ఇందుకు తాను సుప్రీంకోర్టుకు కృతజ్ఞుడినని తెలిపారు. చట్టపరమైన కార్యాచరణతో పాటూ రాజకీయ కార్యాచరణలో కూడా ఏకకాలంలో ముందుకు సాగాలనుకుంటున్నామని చెప్పారు. ఇండియా బ్లాక్నేతలు తమ పిటిషన్‌ను అందచేసిన నేపథ్యంలో విచారణపై అంచనాల గురించి మాట్లాడుతూ, పిటిషన్లో పేర్కొన్న పలు ఆందోళనలను కోర్టు పరిశీలించగలదని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఇవిఎంలకు సంబంధించిన అన్ని అంశాలను, ఆలాగే ఎన్నికల కమిషన్ పనితీరును, ఢిల్లీ పోలీసుల నిరంకుశ నిర్ణయాలు, వారి ఆపరేషన్, అణచివేత చర్యలు, ఢిల్లీలో జరిగిన అన్ని సంఘటనల గురించి సుప్రీం కోర్టు పరిశీలించగలదు.’’ అని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాలను సుప్రీం గమనించకుండా లేదు. అంతకుముందు రోజుల్లో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, పౌర స్వేచ్ఛలు, రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. పిటిషన్లో పేర్కొన్న అన్ని విషయాలను ఈ కోర్టు పరిశీలనలోకి తీసుకుని, విచారిస్తుందన్నారు.
జెఎన్‌యు విద్యార్థులకు సంఘీభావం
జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులపై అక్రమ బహిష్కరణలు ఎత్తివేయాలని కోరుతూ గత 12 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వర్శిటీ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) అధ్యక్షులు అదితిమిశ్రా, ఉపాధ్యక్షులు గోపికబాబు, ప్రధానకార్యదర్శి సునీల్ యాదవ్, మరో తొమ్మిది మంది విద్యార్థులను గురువారం రాత్రి రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ జరిగిన విద్యార్థుల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎ అధ్యక్షులు నేహా బోరా, నాయకులు అనీష్ గవాండే, సామాజిక కార్యకర్త గురుమెహర్, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు నదియా తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల వ్యవహారాల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్ చొరబడి జోక్యం చేసుకుంటున్నాయని, దీనిని వ్యతిరేకిస్తూ తాము పోరాటం చేస్తుంటే వర్శిటీ యంత్రాంగంలో చలనం కూడా లేదని విద్యార్థులు అన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులు సాగిస్తున్న ఈ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నట్లు బ్రిట్టాస్ పేర్కొన్నారు.







కామెంట్లు (0)